ఏపీ సీఎం చంద్రబాబు.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివా సానికి వెళ్లారు. సింగిల్‌గా వెళ్లిన సీఎం చంద్రబాబును పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లారు. కొన్నాళ్లు గా పవన్ కల్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఒకటి రెండు రోజులు మంగళగిరిలోనే ఉండి చికిత్స చేయించుకున్నారు. కానీ.. జ్వరం తగ్గకపోయే సరికి.. పవన్ కల్యాణ్ హైదరాబాద్ చేరుకుని మెరుగైన వైద్యం పొందారు. ప్రస్తుతం ఆయన కొలుకున్నట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు పవన్‌ను కలిసి ఆరోగ్యంపై పరామర్శించారు. అయితే.. ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. రాజకీయంగా ఇటీవల జరిగిన ఘటనలు.. జనసేన పార్టీలో జరుగుతున్న చర్చ వంటి వాటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. పవ న్ కలిసి ఉంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అసెంబ్లీలో జరిగిన రెండు పరిణామాలు.. అటు మెగా కుటుంబంలోను .. ఇటు జనసేన పార్టీలోనూ చర్చనీయాంశం అయ్యాయి. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు బొండా ఉమా మహేశ్వరరావు.. అసెంబ్లీలో కాలుష్యంపై మాట్లాడుతూ.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, రాంకీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలని తాను ఇప్పటికే కోరాననిచెప్పారు.
కానీ, ఎక్కడో లాలూచీ పడుతున్నట్టు అనిపిస్తోందని, దీనివెనుక ఏదో జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యావ రణ శాఖ ను కూడా పవన్ కల్యాణ్ చూస్తున్నారు. ఈ నేపథ్యంలో `ఏదో జరిగిందని` చేసిన వ్యాఖ్యలు పవన్ కల్యాణ్‌ను నొప్పిం చాయి. దీనిపై అసెంబ్లీలోనే ఆయన స్పందించినా.. ఓపెన్ కాలేదు. కానీ, అంతర్గతంగా పార్టీ నాయకులతో పవన్ కల్యాణ్ చర్చిం చినట్టు టీడీపీ వర్గాలకు సమాచారం అందింది. అయితే.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రస్తావించారు. బొండా ఉమాను మందలించారు. అయినా.. పవన్ హర్ట్ అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు.. బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణల మధ్య చోటు చేసుకున్న వ్యాఖ్యలు కూడావివాదానికి దారితీశాయి. పవన్ కల్యాణ్ సోదరుడు.. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి బాలయ్య..వాడు-వీడు అంటూ.. వ్యాఖ్యానించారని జనసేన పార్టీ నాయకులు హర్ట్ అయ్యారు. ఈ వ్యవహారంపై నర్మగర్భంగానే పార్టీ నాయకులు మాట్లాడుతు న్నా.. పవన్‌పై మాత్రం ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిణామాలు.. మున్ముందు తీవ్రం అయ్యే అవకాశం కూడా కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు ఆదివారం సాయంత్రం పవన్‌ను కలుసుకోవడం.. సుమారు 40 నిమిషాలకు పైగానే ఆయనతో అంతర్గత చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలపై చంద్రబాబు ఒకింత పవన్‌ను ఓదార్చే ప్రయత్నం చేశారన్న చర్చసాగుతోంది.