వెస్టిండీస్ క్రికెట్ టీమ్ పేరు చెబితేనే ఒకప్పుడు ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి. 70, 80 దశకాల్లో ఆ జట్టు ఆధిపత్యం మామూలుగా సాగలేదు. అంతకుముందు ప్రపంచ క్రికెట్‌ను ఏలిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలకు చెక్ పెట్టి.. ఇటు టెస్టులు, అటు వన్డేల్లో తిరుగులేని విజయాలు సాధించిందా జట్టు. వన్డేల్లో తొలి రెండు ప్రపంచకప్‌లూ ఆ జట్టుకే సొంతమయ్యాయి. మూడో కప్పును కూడా వాళ్లే గెలవాల్సింది కానీ.. భారత జట్టు అనూహ్యంగా ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అయినా సరే తర్వాత కూడా కొన్నేళ్ల పాటు ప్రపంచ క్రికెట్లో విండీస్ ఆధిపత్యమే సాగింది.
కానీ 90వ దశకం నుంచి ఆ జట్టు ప్రదర్శన పడిపోయి.. గత కొన్నేళ్లలో ఘోరమైన స్థితికి చేరుకుంది. ఒకప్పుడు వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన జట్టు.. చివరి వన్డే ప్రపంచకప్‌కు కనీసం అర్హత కూడా సాధించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంతకంటే పతనం ఉండదు అనుకున్న ప్రతిసారీ ఆ జట్టు.. మరింత ఘోర ప్రదర్శనతో పరాభవాలు మూటగట్టుకుంటోంది. కొన్ని నెలల కిందట ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌లో కేవలం 27 పరుగులకు కుప్పకూలి ఘోర అవమానం చవిచూసిన విండీస్.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో పసికూన అనదగ్గ నేపాల్ చేతిలో పరాజయం పాలైంది.
అసోసియేట్ దేశమైన నేపాల్.. టీ20 మ్యాచ్‌లో కరీబియన్ జట్టును ఓడించింది. విండీస్ జట్టులో కొందరు కొత్త ఆటగాళ్లున్నప్పటికీ.. హోల్డర్, అకీల్ హొసీన్, మేయర్స్, మెకాయ్, అలెన్ లాంటి సీనియర్లూ ఉన్నారు. ఈ జట్టు నేపాల్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులే చేయగలిగింది. వెస్టిండీస్ టెస్టులు, వన్డేల్లో ఎంత పేలవ ప్రదర్శన చేసినా తట్టుకున్నారు అభిమానులు. కానీ తమకు నప్పే, తమ ఆటగాళ్లు బాగా ఆడతారని పేరున్న టీ20ల్లోనూ నేపాల్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోవడం మాత్రం జీర్ణించుకోలేనిదే.