ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ కోర్టు మంజూరు చేయలేదు. ఈ క్రమంలోనే ఆ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారంలో రెండు రోజుల పాటు సిట్ విచారణకు హాజరవడం, రెండు షూరిటీలు, రూ. 2 లక్షల పూచికత్తు వంటి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, సాక్షులను బెదిరించకూడదని, సహనిందితులతో కేసు గురించి మాట్లాడకూడదని షరతులు విధించింది. వాట్సాప్ నెంబరు, ఆధార్, ఈ మెయిల్ ఐడీ వివరాలు పోలీసులకు అందించాలని షరతు విధించింది. లిక్కర్ కేసులో జులై 20న మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. రేపు మధ్యాహ్నం జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశముంది. ఈ కేసులో ఏ31 ధనుంజయరెడ్డి, ఏ32 కృష్ణమోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలకు ఆల్రెడీ బెయిల్ మంజూరైంది.