తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 2024లో కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడంలో టిడిపి కూటమి కీలక పాత్ర పోషించిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టీఆర్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు తెలుగువాడు దేశంలో ఉన్నాడని నిరూపించింది అన్న ఎన్టీఆర్ అని, అందులో ఎటువంటి సందేహం లేదని కేటీఆర్ కితాబిచ్చారు. అదేవిధంగా దేశంలో తెలంగాణ వారు ఉన్నారని నిరూపించిన ఘనత కచ్చితంగా తమ నాయకుడు కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలోని హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించలేని రేవంత్ రెడ్డి...ఫ్యూచర్ సిటీ కడతానంటూ ఫోజులు కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. బాకీ కార్డుతో రేవంత్ రెడ్డి భరతం పడతామని కేటీఆర్ హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
మూసీ నది ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లు కొట్టేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ వేసిందని, అందులో భాగంగానే ఎంజీబీఎస్ మునిగిందని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. పథకం ప్రకారమే ఎంజీబీఎస్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముంచేసిందని ఆరోపించారు.