2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని కూటమి పార్టీల నేతలు ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ నిర్వాకం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు పాటుపడుతున్నారు. అయితే, పథకాలు అమలు చేయడం, సూపర్ సెక్స్ అమలు చేయడం ఒక ఎత్తయితే... వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం, తగిన ప్రచారం కల్పించడం మరో ఎత్తు.
ఈ నేపద్యంలోనే కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాలని టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. చేసిన పనులు ప్రజలకు తెలియజేయాలని, అప్పుడే ప్రభుత్వంపై వారికి నమ్మకం పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజలతో మమేకమై మంచి పేరు తెచ్చుకోవాలని, ప్రభుత్వం చేస్తున్న పనులను వారికి వివరించాలని దిశానిర్దేశం చేశారు. కూటమికి అద్భుత విజయాన్ని ప్రజలు కట్టబెట్టారని, అంతకుమించిన స్థాయిలో 2029లో మళ్లీ కూటమి పార్టీలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆ గెలుపు కోసం కూటమి పార్టీలు బలపడాలని పిలుపునిచ్చారు.