దేశ చరిత్రలోనే తొలిసారిగా ట్రూ డౌన్ విధానాన్ని ఏపీలో అమలు చేయబోతున్నామని, దీంతో విద్యుత్ ఛార్జీల భారం తగ్గనుందని సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. యూనిట్ విద్యుత్ ధర 13 పైసల వరకు తగ్గించబోతున్నామని, నవంబర్ నెల నుంచి తగ్గిన విద్యుత్ చార్జీలు అమల్లోకి వస్తాయని చంద్రబాబు చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రజా ప్రభుత్వం అంటే ఇదని కూటమి ప్రభుత్వం మరోసారి నిరూపించిందని లోకేష్ అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అస్తవ్యస్థం చేశారని మండిపడ్డారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు మొదలు ట్రూ అప్ చార్జీల వరకు ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు.
జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యమైందని మండిపడ్డారు. ఆ భారాన్ని ప్రజలపై మోపి విద్యుత్ ఛార్జీలు పెంచారని లోకేష్ విమర్శించారు. ట్రూ డౌన్ నిర్ణయంతో విద్యుత్ వినియోగదారులకు దాదాపు 1000 కోట్ల రూపాయల లబ్ధి చేకూరనుందని లోకేష్ అన్నారు.