పార్టీలు.. ప్రజలు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలంగాణ స్థానిక ఎన్నికలకు ముహూర్తం రెడీ అయిం ది. అక్టోబరు 9వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ మహా క్రతువు.. నవంబరు 11వ తేదీ వరకు దశలవారీగా జరగనుం ది. ఎంపీటీసీ, జడ్పీటీసీ సహా గ్రామ పంచాయతీలకు.. ఎన్నికలు నిర్వహించనున్నారు. వాస్తవానికి వాటికి ఏడాది కిందటే సమయం చెల్లిపోయింది. అయితే.. ప్రత్యేక అధికారుల పాలనను పెంచుకుంటూ వచ్చారు. ఇటీవల హైకో ర్టు తీర్పు నేపథ్యంలో ఈనెల 30(రేపు)లోపు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాణి కుముదిని నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రామ పంచాయతీ ఎన్ని కలను మూడు దశల్లో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే.. స్థానిక సమరంలో పైచేయి సాధించేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ గత ఆరు మాసాలుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామీణ స్థాయిలో పర్యటనలు, ప్రచారం కూడా చేపట్టింది. ముఖ్యంగా రైతు భరోసా నిధులు విడుదల చేయడంలోను.. రైతు రుణమాఫీ విషయంలోనూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది.
అలాగే.. రాష్ట్ర స్థాయిలోనూ.. ఎంపీటీసీ.. జడ్పీటీసీల్లోనూ పాగా వేయాలని బీఆర్ ఎస్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ పనితీరు.. అవినీతి.. ప్రాజెక్టులు.. ఇలా అనేక విషయా లను ప్రజల మధ్యకు తీసుకువెళ్లింది. ఇప్పుడు రానున్న రోజుల్లో మరింతగా ఈ ప్రచారం ఊపందుకోనుంది. ఇదిలా వుంటే.. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహాలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా 60 వేల ఉద్యోగాలు.. రైతు భరోసా నిధులు సహా పెట్టుబడులు.. వంటివాటిని హైలెట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.
అయితే.. ఇరు పక్షాల్లోనూ.. వివాదాలు నెలకొనడం గమనార్హం. బీఆర్ ఎస్ విషయానికి వస్తే.. క్షేత్రస్థాయిలో గత ఎన్నికల సమయంలో టికెట్లు దక్కలేదన్న అసంతృప్తి నాయకుల్లో ఉంది. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత.. కూడా తమనుపట్టించుకోవడం లేదని చాలా మంది నాయకులు భావిస్తున్నారు. దీంతో ఈ ప్రభావం స్థానికంపై పడే అవకాశం కనిపిస్తోంది. అదేసమయంలో కాంగ్రెస్‌లోనూ.. మంత్రుల మధ్య సఖ్యతలోపం.. మంత్రి పీఠాలు ఆశించిన వారిలో తీవ్ర నైరాశ్యం.. నేతల మధ్య కలివిడిలేని తనం వంటివి వెంటాడుతున్నాయి. ఈ సమస్యలను పక్కన పెడితే.. ఇరు పక్షాల మధ్యయుద్దం హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.