పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ మూవీకి షాక్ తగిలింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ సోమవారం రాత్రి జీవోను విడుదల చేసింది. ఇంతకూ ఈ జీవో సారాంశం ఏమంటే.. ఓజీ మూవీ టికెట్ల ధరల్ని వెంటనే తగ్గించాలని పేర్కొంటూ సింగిల్ స్క్రీన్.. మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మూవీ టికెల్ ధరల పెంపును తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసిన నేపథ్యంలో.. ఈ పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబరు 25న విడుదలైన ఈ మూవీకి టికెట్ల ధరల్ని పెంచుతూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ రిలీజ్ కు ముందు రోజు రాత్రి (అక్టోబరు 4న) ప్రీమియర్ షోకు భారీగా ధరల్ని పెంచుతూ ప్రభుత్వం అనుమతిచ్చింది. పెంచిన ధరల్ని తప్పు పడుతూ.. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ.. మహేశ్ యాదవ్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదోపవాదాల నేపథ్యంలో ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఈ నెల 24న ఆదేశాలు జారీ చేశారు.
అయితే.. టికెట రేట్లపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. రివ్యూ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. టికెట్ ధరల్ని పెంచేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సింగిల్ బెంజ్ ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొంది. తదుపరి విచారణను అక్టోబరు తొమ్మిదో తేదీకి వాయిదా వేస్తూ టికెట్ ధరల్ని ఎందుకు పెంచాలనుకున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలో సోమవారం రాత్రి తెలంగాణ పోలీసు శాఖ మెమో విడుదల చేస్తూ.. మంగళవారం నుంచి ఓజీ మూవీ టికెట్ ధరల్ని తగ్గించాలని.. రెగ్యూలర్ ధరలకు టికెట్లు అమ్మాలని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.