టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్సన్‌ను గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం కూల్చి వేయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపగా.. ఈ క్రమంలోనే ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చేశారు. నాగార్జునను కావాలనే రేవంత్ టార్గెట్ చేశారంటూ ఓ వర్గం ఆయనపై మండిపడితే.. ప్రభుత్వం సరైన పనే చేసిందంటూ ఇంకో వర్గం వాదించింది.
ఐతే నెమ్మదిగా వ్యవహారం సద్దుమణిగిపోయింది. నాగార్జున ఒకట్రెండు సందర్భాల్లో రేవంత్‌ను కలవడం, సన్నిహితంగా కనిపించడంతో ఇరువురి మధ్య ప్రతిష్ఠంభన ఏమీ లేదని స్పష్టమైంది. తర్వాత ఓ కార్యక్రమంలో నాగార్జున గురించి రేవంత్ పాజిటివ్ కామెంట్స్ కూడా చేశారు. ప్రభుత్వానికి 2 ఎకరాల భూమిని కూడా నాగ్ ఇచ్చారని కూడా వెల్లడించారు. తాజాగా మరోసారి నాగ్, ఎన్ కన్వెన్షన్ ప్రస్తావన తెచ్చారు రేవంత్ రెడ్డి.
మూసీ వరదల నేపథ్యంలో హైడ్రా చేపడుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత సరైందే అంటూ ఆయన సమర్థించుకున్నారు.
ఎవరేమన్నా హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత ఆగదన్నారు రేవంత్. ఎన్ కన్వెన్షన్ కూల్చినపుడు చాలామంది తప్పుబట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. చెరువులో ఉన్నందువల్లే, కబ్జా భూమిలో కట్టడం వల్లే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చామన్నారు. ఇది అక్రమ కట్టడం అని అధికారులు రెండు మూడుసార్లు నాగార్జునను కలిసి చెప్పినా ఆయన కొన్ని పాత సావాసాల వల్ల వినిపించుకోలేదని.. ఆ భూమిని కబ్జా చేసిన వాళ్లు నాగార్జునకు అమ్మి ఉండొచ్చని రేవంత్ అన్నారు.
నాగార్జున తనకు కూడా మంచి మిత్రుడే అని.. అయినా సరే ఎన్ కన్వెన్షన్ చెరువులో ఉండడం వల్ల దాని కూల్చివేయక తప్పలేదని రేవంత్ స్పష్టం చేశారు. తర్వాత తప్పు తెలుసుకున్న నాగార్జున.. ఇకపై తనకు ఇలాంటి వద్దు అంటూ ప్రభుత్వం చేస్తున్న మంచిని గుర్తించి స్వయంగా రెండు ఎకరాల భూమిని అప్పగించారని రేవంత్ వెల్లడించారు. హైదరాబాద్‌లో చాలామంది మాయగాళ్లు ఉన్నారని.. వాళ్లకు బాస్‌లు ఎవరో తమకు తెలుసని.. ఇలాంటి వాళ్లను నమ్మి భూములు కొని మోసపోవద్దని జనాన్ని రేవంత్ హెచ్చరించారు.