తెలుగు తల్లి. తెలంగాణ తల్లి, మరాఠా తల్లి...ఇలా ఉండరు అంటూ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో హీరో పవన్ కల్యాణ్ ఓ డైలాగ్ చెబుతారు. కానీ, వాస్తవంగా తెలుగు తల్లి వేరు..తెలంగాణ తల్లి వేరు అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే, దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును తాజాగా తెలంగాణ తల్లి అని మారుస్తూ అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
తాజాగా హైదరాబాద్ లోని కీలకమైన ఫ్లైఓవర్లలో ఒకటైన 'తెలుగు తల్లి' ఫ్లైఓవర్ నేమ్ బోర్డు మారింది. ఆ ఫ్లైఓవర్ నేమ్ బోర్డుపై ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్ అని నేటి నుంచి కనిపిస్తుండడంతో ప్రజలు షాకయ్యారు. కొత్త పేరుతో కూడిన బోర్డును ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేయడంతో అధికారికంగా ఆ పేరు అమల్లోకి వచ్చింది. తెలుగు భాష మాట్లాడే ప్రజలకు తెలుగు తల్లి ఒకరే అని ప్రజలు అంటున్నారు. కానీ, ఇలా ప్రాంతాల వారీగా తెలుగు తల్లిని విభజించి తెలంగాణ తల్లి అని పేరు పెట్టడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.