వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ పదే పదే ఒక డైలాగ్ చెప్పేవారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ అరిగిపోయిన రికార్డులా ప్రతి సభలో సెంటిమెంట్ డైలాగ్ కొట్టేవారు. అయితే, ఆ డైలాగ్ జగన్ సొంత సామాజిక వర్గం నేతలకు నచ్చలేదన్న విషయం ఆయనకు అర్థమయ్యే సరికి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ విషయంపై మాజీ వైసీపీ నేత, ప్రస్తుత టీడీపీ నేత, మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు.
బడుగు, బలహీన వర్గాలను జగన్ తీవ్రంగా వంచించారని, ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ’ అంటూ వారికి తీరని అన్యాయం చేశారని పార్థసారథి ధ్వజమెత్తారు. నేతి బీరకాయలో నెయ్యి మాదిరి బలహీన వర్గాలపై జగన్ రెడ్డికి ప్రేమ ఉందని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాలనలో కీలకమైన ప్రభుత్వ పదవులు, ఛైర్మన్ పోస్టులు, ముఖ్య సలహాదారుల నియామకాల్లో జగన్ తన సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
బీసీ నాయకుడైన చంద్రయ్య కుటుంబానికి న్యాయం చేసేందుకు ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామని, ఆ విషయంలో వైసీపీ అడ్డుపడటమే వారి బీసీ వ్యతిరేక విధానాలకు నిదర్శనమని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వైసీపీ పాలనలో బలహీన వర్గాలపై జరిగిన దాడులు, అవమానాలను ప్రజలు గమనింరని, అందుకే 2019లో 151 సీట్లతో గెలిచిన ఆ పార్టీని 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు.