సినిమాల కంటే వివాదాల చుట్టూ తిరిగే టాలీవుడ్ నటీమణుల్లో డింపుల్ హయాతి పేరు ముందు వరుసలో ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ మాటకు తగ్గట్లే తాజాగా మరో వివాదంలో ఆమె చిక్కుకున్నారు. తాజాగా ఆమెపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇంట్లో పని చేసే పనిమనిషిని వేధింపులకు గురి చేస్తున్నారన్న ఫిర్యాదు పోలీసులకు అందటంతో వారు కేసు నమోదు చేశారు.
గల్ఫ్ మూవీతో కెరీర్ షురూ చేసిన డింపుల్ హయాతి.. గద్దలకొండ గణేష్.. ఖిలాడి.. రామబాణం చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు బ్రేక్ రాలేదు. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయవంతం కాని నేపథ్యంలో ఆమెకు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే.. తరచూ ఏదో ఒక వివాదంలో ఆమె పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్య తాను ఉండే అపార్టుమెంట్ లో పార్కింగ్ విషయంలో ఒక ఐపీఎస్ తో ఆమెకు నెలకొన్న వివాదం అప్పట్లో సంచలనంగా మారింది.
ఈ మధ్యన హెల్త్ ఇష్యూస్ తో సతమతమవుతూ.. ఏడాదికి పైనే సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. సరైన అవకాశం కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఇదిలా ఉంటే..ఆమె ఇంట్లో పని చేసే ఇద్దరు యువతలను వేధింపులకు గురి చేసినట్లుగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెంపుడు కుక్కల్ని చూసుకునేందుకు ఒడిషాకు చెందిన ఇద్దరు యువతుల్ని పని కోసం పెట్టుకున్నప్పటికి.. వారికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వకపోవటం..అసభ్య పదజాలంతో దూషించటం.. భయపెట్టటం లాంటి ఆరోపణలతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
‘మీరు నా చెప్పులంత విలువ చేయరు. మీరెంత? మీ బతుకెంత?’ అంటూ ఆ అమ్మాయిలతో డింపుల్ భర్తగా చెప్పే వ్యక్తి దురుసుగా ప్రవర్తించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జీతం అడిగితే ఇంట్లో నుంచి పంపించేశారని చెబుతున్నారు. బాధిత మహిళలు తాము పడిన వేధింపుల గురించి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఏమైనా.. తరచూ ఏదో ఒక వివాదంతో డింపుల్ హయాతి పేరు ముడిపడటం ఆమె కెరీర్ కు ఇబ్బందిగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.