ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. సినిమాను సినిమాగానే చూస్తా నని ఆయన తేల్చి చెప్పారు. దీనిని రాజకీయ కోణంలో ముడి పెట్టలేనని తేల్చి చెప్పారు. అందరూ బాగుండాలన్న ది తన సిద్ధాంతమన్నారు. తనవి జాతీయ భావనలని పేర్కొన్న పవన్ కల్యాణ్.. బావిలో కప్పలా వ్యవహరించలేనని తేల్చి చెప్పారు. ఆదరించే ప్రేక్షకులు ఉన్నప్పుడు.. రాజకీయంగా సినిమాల విషయంలో జోక్యం చేసుకునేందుకు తాను పూర్తిగా వ్యతిరేకమని తేల్చి చెప్పారు. నటులు సోదరభావంతో స్నేహ భావంతో మెలగాలన్నదే తన సిద్ధాంత మన్నారు.
విషయం ఇదీ..
పవన్ కల్యాణ్ నటించిన `ఓజీ` సినిమా దేశవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో సానుకూల సహకారం ఉన్నప్పటికీ.. కర్ణాటకలో మాత్రం వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓజీ సినిమా పోస్టర్లను.. ఫ్లెక్సీలను తొలగించాలని ఆదేశించింది. దీంతో కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలో అధికారులు, సిబ్బంది ఆ పనిలో ఉన్నారు. దీనికితోడు ఓజీ సినిమా టికెట్ ధరలను కూడా సిద్దరామయ్య ప్రభుత్వం పెంచలేదు. ఈ పరిణామాలు పవన్ అభిమానులను.. జనసేన నాయకులను ఆగ్రహానికి గురి చేశాయి.
మరోవైపు.. అదే కర్ణాటకకు చెందిన హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ - 1 విడుదలకు సిద్ధమైంది. దీనికి ఏపీలోనూ టికెట్ల ధరలు పెంచుకునేందుకు కూటమి సర్కారు అనుమతి ఇచ్చింది. అయితే.. పవన్‌కల్యాణ్ సినిమా విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పుడు.. కన్నడ నటుడి సినిమా విషయంలో ఏపీలో ఇంత ఉదారంగా ఎందుకు ఉండాలన్నది పవన్ అభిమానులు, జనసేన నాయకులు సంధిస్తున్న ప్రశ్న. ఈ క్రమంలోనే ఓ డెలిగేషన్ తాజాగా పవన్ ను కలిసి.. విషయాన్ని వివరించింది. అయితే.. వారి వాదనను సున్నితంగా తిరస్కరించిన పవన్.. సినిమా అనేది కళ అని.. దీనిని అలానే చూడాలని.. రాజకీయాలు చొప్పించడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.