ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వానికి ఏమైంది? విపక్షంలో ఉన్నప్పుడు తమను.. తమ పార్టీ నేతల్ని.. క్యాడర్ ను టార్గెట్ చేసిన వారి సంగతి చూస్తామంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ అధినేత.. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారుతున్నాయి. జగన్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన పలువురు అధికారులకు కీలక పోస్టింగులు ఇవ్వటం గతంలో సంచలనంగా మారితే..తాజాగా వెలుగు చూసిన ఉదంతం గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు.
కూటమి సర్కారుకు ఏమైంది? ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. ప్రభుత్వ పగ్గాలు కూటమి చేతుల్లో ఉన్నాయా? లేవా?అన్న సందేహానికి గురి చేసేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. కడప రాజకీయమా? మజాకానా? అనుకోకుండా ఉండలేం. ఇంతకూ అసలేం జరిగిందంటే.. కడప టీడీపీ మహిళా ఎమ్మెల్యే మాధవిరెడ్డిని టార్గెట్ చేస్తూ.. ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అసభ్య పోస్టులు పెట్టారు.
ఈ ఉదంతంలో వైసీపీ నేత.. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా.. ఆయన సోదరుడు అహ్మద్ బాషా.. పీఏ ఖాజా ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి.. ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి. ఈ నేపథ్యంలో కడప ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆధారాలతో ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు కట్టిన కడప ఒకటో పట్టణ సీఐను గంటల వ్యవధిలో వీఆర్లోకి పంపిస్తూ ఉత్తర్వులుజారీ కావటం సంచలనంగా మారింది.
వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకుంటే అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా అధికారపార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదునుకేసు కడితే వీఆర్ లోకి పంపటం ఏమిటన్నది టీడీపీ వర్గీయులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారిపై కేసు పెట్టిన అధికారిని ప్రోత్సహించటం వదిలేసి.. వీఆర్ లోకి పంపటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా.. ఈ ఉదంతానికి సంబంధించి మరిన్ని అంశాలు బయటకు వచ్చాయి.
ఎమ్మెల్యే మాధవి రెడ్డి చేసిన ఫిర్యాదుపై వైసీపీ నేత అంజాద్ బాషా పీఏ ఖాజా ఒక్కరినే నిందితుడిగా చేర్చకుండా.. అంజాద్ బాషాను.. ఆయన సోదరుడ్ని ఎందుకు నిందితులుగా చేర్చారంటూ సదరు సీఐను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రశ్నించటమే కాదు.. క్రమశిక్షణ ఉల్లంఘించారని పేర్కొంటూ చర్యలు తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. సీఐ రామక్రిష్ణను వైసీపీ అధికారంలో ఉన్న వేళలోనూ టార్గెట్ చేయటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినంతనే కడపలో సీఐగా పని చేస్తున్న ఆయన్ను బదిలీ చేసి ఏడాది పాటు వీఆర్ లో పెట్టారు. ఆ తర్వాత కూడా అంజాద్ బాషా.. నాటి కడప మేయర్ సురేశ్ బాబులు ఆయన్ను కడప జిల్లాలో ఉండనివ్వకుండా అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. అక్కడా ఎలాంటి పోస్టింగ్ లు ఇవ్వకుండా వీఆర్ లోనే ఉంచేశారు.
దాదాపు రెండేళ్ల తర్వాత ఏ మాత్రం ప్రాధాన్యత లేని మానవ హక్కుల కమిషన్ విభాగంలో సీఐగా పోస్టింగ్ లభించింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ బాధితుడైన ఆయన్ను కడప పట్టణ ఒకటో పోలీస్ స్టేషన్ కు సీఐగా నియమించారు.
కూటమి ప్రభుత్వంలో కీలకమైన టీడీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూ.. ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో కేసు నమోదు చేసినందుకు వీఆర్ లోకి పంపిన వైనం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
కడప స్పెషల్ బ్రాంచ్ మొత్తం వైసీపీ సానుభూతిపరులైన పోలీసులతో నిండిపోయినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా అధికార పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తే.. సదరు సీఐపై చర్యలు తీసుకోవటం దేనికి నిదర్శనం? దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తారా? తగిన చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.