వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ సీనియర్ నాయకు డు, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పీఏ ఖాజాను గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజాద్ బాషా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు పెట్టొద్దని హైకోర్టు చెప్పినా.. వినిపించుకోరా? పోలీసుల రాజ్యం నడుస్తోందా? అని ప్రశ్నించారు.
ఈ క్రమంలో పోలీసులకు, అంజాద్ బాషాకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం.. ఖాజాను పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనగా.. అంజాద్ బాషా... బంద్‌కు పిలుపునిచ్చారు వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేశాయి. అయితే.. పోలీసులు స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. మరోవైపు.. అదనపు బలగాలను కూడా కడపకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలావుంటే.. అంజాద్ బాషా, ఆయన సోదరుడిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఏంటి వివాదం?
సోషల్ మీడియాలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలలో వైసీపీ సానుభూతి పరులు, ఆ పార్టీ ఐటీవింగ్ కూడా.. ప్రభుత్వానికి, నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిపై కొందరు అసభ్యకర పోస్టులు పెట్టారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో మాధవి, ఆమె భర్త, టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసులు రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రామకృష్ణ వారి ఫిర్యాదు మేరకు అంజాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, పీఏ ఖాజాలపై కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే ఖాజాను అరెస్టు చేశారు. అయితే.. ఇది రాజకీయ దురుద్దేశంతోనే చేశారని.. అంజాద్ బాషా ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు సోషల్ మీడియాలో కేసులపై ముందుగానే విచారణ చేయాలని.. కానీ.. అలా చేయకుండా నేరుగా అరెస్టులు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. దీంతో కడపలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.