తెలుగోళ్ల దెబ్బకు రిషబ్ దిగి రాక తప్పలేదు

admin
Published by Admin — October 03, 2025 in Movies
News Image
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి తెలుగోడి చర్మం కాస్తంత దళసరి. చాలా విషయాల్ని పెద్దగా పట్టించుకోడు. తన అమ్మభాషను ఎవరు ఎలా చూసినా.. ఎవరేమన్నా రియాక్టు కారు. సౌత్ ఇండియాలో తమ అమ్మభాష మీద పెద్దగా పట్టింపులు లేని జాతి ఏదైనా ఉందంటే అది తెలుగోళ్లు మాత్రమే అన్న మాట కొందరు విమర్శకులు పదునుగా అనేస్తుంటారు. సామాజిక చైతన్యం తర్వాత.. తమ ఉనికి సవాలు చేసినా.. హేళన చేసినా పెద్దగా పట్టని తీరు తెలుగోళ్లతో ఎక్కువగా కనిపిస్తుంటుంది.
 
కాంతారా మూవీతో ఒక్కసారిగా తిరుగులేని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న కన్నడ నటుడు రిషబ్ శెట్టి.. తన కాంతారా చాఫ్టర్ వన్ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో తెలుగులో మాట్లాడకుండా వ్యవహరించిన తీరుపై తెలుగోళ్లు అనూహ్యంగా రియాక్టు అయ్యారు. ఎప్పుడూ.. ఏ విషయానికి స్పందించని తెలుగోళ్లలో ఎక్కడో టచ్ అయ్యేలా చేసిన క్రెడిట్ మాత్రం సోషల్ మీడియా పుణ్యమనే చెప్పాలి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది.. అందునా తమిళ.. కన్నడ.. తెలుగు నటీనటులకు మొత్తంగా కాకుండా మూడు భాషల మీద అంతో ఇంతో అవగాహన ఉంటుంది. వారు తలుచుకుంటే మాట్లాడటం అంత పెద్ద విషయం కాదు.
 
ప్రతిది వ్యాపారమైన వేళ.. ఏ నేల మీద ఈవెంట్ నిర్వహిస్తే.. ఆ ప్రాంత అమ్మభాషలో నాలుగు ముక్కలు మాట్లాడితే సరిపోతుంది. తెలుగోళ్లకు బాగా కనెక్టు అయిన పవన్ లాంటి స్టార్ సినిమా విడుదల సందర్భంగా కన్నడిగులు కొందరు చేసిన రచ్చ వేళ.. ఇది తప్పు పద్దతి అంటూ మాట్లాడిన నాధుడే లేడు. పవన్ ‘ఓజీ’ మూవీ విడుదల సందర్భంగా కొందరు కన్నడిగులు వేసిన యేషాలు అన్నిఇన్ని కావు. పోస్టర్లు చించేయటం.. ఫ్లెక్సీలను తొలగించటం లాంటివి చేస్తే.. ఇలా చేయటం తప్పు.. ఇది మంచి పద్దతి కాదని చెప్పినోళ్లు లేరు.
 
ఇదో మంటగా ఉన్న వేళలో.. హైదరాబాద్ లో నిర్వహించిన కాంతార మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కన్నడలో మాత్రమే మాట్లాడి.. తెలుగును.. తెలుగోళ్లను లైట్ తీసుకున్న రిషబ్ శెట్టి తీరును తప్పు పడుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఈ సందర్భంగా అప్పట్లో కాంతార మూవీ విడుదల వేళలో తెలుగులో మాట్లాడిన పెద్దమనిషి.. భారీ సక్సెస్ వచ్చిన తర్వాత తెలుగును లైట్ తీసుకోవటాన్ని పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు ప్రశ్నించటంతో చాలామంది తెలుగోళ్లు.. మరి ముఖ్యంగా జెన్ జీ బ్యాచ్ బాగా కనెక్టు అయ్యారు.
 
నిజానికి ఇలాంటి ఎమోషనల్ అంశాలకు జెన్ జీ (జనరేషన్ జెడ్) బ్యాచ్ పెద్దగా కనెక్టు కారన్న మాటకు భిన్నంగా రియాక్టు కావటమే కాదు..కాంతార మూవీని బాయ్ కాట్ చేయాలన్న పిలుపునకు పెద్ద ఎత్తున స్పందన రావటం తెలిసిందే. ఈ అంశం వైరల్ గా మారిన వేళ.. రిషబ్ శెట్టికి ఒక్కసారి రియాల్టీ అర్థమైనట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. విజయవాడలో జరిగిన మూవీ ప్రీరిలీజ్ వేడుకలో తెలుగులో మాట్లాడిన తీరు చూసినప్పుడు..హైదరాబాద్ ఈవెంట్ లో అయ్యగారు ప్రదర్శించిన తీరుకు భిన్నంగా ఉండటం చూస్తే. సోషల్ మీడియా సెగ బాగానే తగిలినట్లుగా కనిపిస్తోంది.
 
తనకు తెలుగు అంతగా రాదని.. అందుకే హైదరాబాద్ ఈవెంట్ లో కన్నడలో మాట్లాడినట్లుగా వివరణ ఇచ్చుకున్న రిషబ్.. ‘‘నాకు తెలుగు అంత బాగా రాదు. కానీ.. మాట్లాడేందుకు ట్రై చేస్తున్నా. నాకు సపోర్టు చేస్తున్న అందరికీ థ్యాంక్స్. ట్రైలర్ రిలీజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. డార్లింగ్ ప్రభాస్ కు కృతజ్ఞతలు. ఎపీలో టికెట్ రేట్లు పెంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి థ్యాంక్స్. కన్నడ.. తెలుగు అందరం సోదరులం. తర్వాతి మూవీ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో వర్కు చేస్తున్నా. జై హనుమాన్ మూవీ రిలీజ్ టైంకు పూర్తిగా తెలుగు నేర్చుకొని వస్తాను. అప్పుడు కచ్ఛితంగా తెలుగులోనే మాట్లాడతా. అక్టోబరు 2న కాంతార 1 మూవీని అందరూ చూడాలి’’ అంటూ మొత్తం ప్రసంగాన్ని తెలుగులో మాట్లాడిన రిషబ్ తీరుకు తెలుగోళ్లు కాస్తంత శాంతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
 
హైదరాబాద్ ఈవెంట్ లో ప్రదర్శించిన తీరుకు భిన్నంగా విజయవాడ వేడుక వేళ వ్యవహరించిన రిషబ్ తీరుకు తెలుగోళ్లు తమ బాయ్ కాట్ పిలుపును వెనక్కి తీసుకుంటారా? అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు.. అమ్మ భాషను సీరియస్ గా తీసుకోని తీరుకు భిన్నంగా వ్యవహరించిన తాజా పరిస్థితి ఆసక్తికరంగా మారింది. తమ అమ్మభాష విషయంలో ఎవరెట్లా రియాక్టు అయినా చూసిచూడనట్లుగా ఉండే తీరుకు భిన్నంగా వ్యవహరించిన తెలుగోళ్ల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే.. కొత్త తరంలో అమ్మభాష మీద మమకారం పెరగటమే కాదు.. ఎవరైనా తెలుగును తక్కువ చేసినట్లుగా వ్యవహరిస్తే.. తిప్పలు తప్పవన్న హెచ్చరికను జారీ చేసినట్లుగా చెప్పక తప్పదు.
Tags
Rishabh Shetty kantara chapter 1 movie release in ap ticket prices hike
Recent Comments
Leave a Comment

Related News