తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి తాజాగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమది ఖాకీ బుక్కేనని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ `బుక్కు` కామెంట్ల గురించి తెలిసిందే. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ఫిర్యాదులను దీనిలో నమోదు చేయాలని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు.
అలానే.. తెలంగాణలోనూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ నాయకులు.. `పింక్ బుక్` కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్.. పింక్ బుక్‌పై తరచుగా ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి.. వారిని కొట్టి, తిట్టి, వేధించిన పోలీసుల పేర్లను ఈ పుస్తకంలో రాసుకుంటున్నామని.. తాము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామనిఆయన హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా డీజీపీ స్పందించారు.
తమకు రాజకీయాలకు సంబంధం లేదన్న శివధర్ రెడ్డి.. తమకు పింక్ బుక్, వైట్ బుక్, రెడ్ బుక్ వంటివి ఏమీ తెలియదని చెప్పారు. తమకు తెలిసిందల్లా ఖాకీ బుక్ మాత్రమేనన్నారు. దీనిని మాత్రమే తాము అమలు చేస్తామని.. దీనిలో సీఆర్ పీసీ, ఐపీసీ సెక్షన్లు సహా రాజ్యాంగ బద్ధమైన నిబంధనలు మాత్రమే ఉంటాయన్నారు. ఇతర పుస్తకాలతో తమకు సంబంధం లేదని తెలిపారు. అవన్నీ రాజకీయ పరమైన పుస్తకాలని.. వాటి గురించి తాము కామెంట్లు చేయబోమన్నారు.
ఇక, సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై కూడా డీజీపీ స్పందించారు. అసభ్యత, అశ్లీలతకు చోటు లేకుండా.. సోషల్ మీడియాలో ఎవరైనా స్పందించవచ్చన్నారు. కానీ, కుటుంబాలను హీన పరిచేలా.. నాయకులను అవమానించేలా మాత్రం కామెంట్లు చేయొద్దని సూచించారు. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే.. తాము ఎంటర్ అవ్వకతప్పదని హెచ్చరించారు.