కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి ఏటా దసరా రోజు అర్థరాత్రి జరిగే `బన్నీ` వేడుక ఈ ఏడాది కూడా.. ఘనంగానే జరిగింది. అయితే, గతానికి భిన్నంగా ఈ సారి ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవాని కి.. బన్నీ ఉత్సవంలో మరణాలు చోటు చేసుకోవు. కేవలం దెబ్బలకు మాత్రమే పరిమితం అవుతుంది. అయితే.. ఈ సారి ఇద్దరు భక్తులు మృతి చెందడంతో ఈ బన్నీ ఉత్సవంలో ఏం జరిగిందన్న విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఏంటీ ఉత్సవం?
దేవరగట్టు కొండపై మౌళి మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఆలయంలో దసరా శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడి రెండు గ్రామాల ప్రజలు విడిపోయి.. స్వామి వారి సేవలో తామంటే తామే ముందుంటామని ఆది నుంచి పోటీ పడతారు. ఇలా.. ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 9 రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. అనంతరం.. దసరా రోజు రాత్రి మౌళి మల్లేశ్వరస్వామి దుర్గాంబ అమ్మవారికి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. అనంతరం.. దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు.
ఈ ఉరేగింపునే బన్నీ ఉత్సవంగా చెబుతారు. ఈ ఊరేగింపులో దేవతా విగ్రహాలను ముందు మేమే ఊరేగిం పునకు తీసుకువెళ్లాం అంటూ.. ఒక వర్గం, కాదు, ముందుగా మేమే ఊరేగింపు చేస్తామని రెండో వర్గం ఘర్షణ లకు దిగుతాయి. ఈ క్రమంలోనే కర్రలతో దాడులు చేసుకుంటారు. సాధారణంగా.. బలమైన దెబ్బలు పడకుండానే చూసుకుంటారు. ఇంత జరుగుతున్నా.. ఎవరూ మద్యం తాగరు. మాంసం కూడా ముట్టరు. అలా పవిత్రంగానే బన్నీ ఉత్సవం చేసుకుంటారు.
తాజాగా ఏం జరిగింది?
తాజాగా శుక్రవారం తెల్లవారు జామున జరిగిన బన్నీ ఉత్సవంలో బలమైన దెబ్బలు తాళలేక ఇద్దరు మృతి చెందారు. మరో 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరికి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక, మృతుల విషయంపై స్పందించిన ప్రభుత్వం బన్నీ ఉత్సవంలో ఏమైనా రాజకీయ నేతలప్రమేయం ఉందా? అనే విషయంపై విచారణ చేయాలని.. బాధ్యులను గుర్తించాలని ఆదేశించింది. ఇదిలావుంటే.. గతంలో బన్నీ ఉత్సవం జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించేవారు. ఈ దఫా పోలీసులు అటు వైపు దృష్టి పెట్టలేదని అంటున్నారు. ఈ కారణంగానే ఘర్షణలు పెరిగాయని చెబుతున్నారు.