తమిళ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధ్యక్షుడు, ఇళయ దళపతి విజయ్‌కు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో భారీ షాక్ తగిలింది. తమిళనాడులోని కరూర్‌లో గత నెల 27న జరిగిన భారీ తొక్కిసలాట ఘటనను సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుతం రెండు రకాలుగా ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందన్న కోర్టు.. ముందుగా ఆయా విచారణ నివేదికలు వచ్చిన తర్వాత.. వాటిలో లోపాలు కనిపిస్తే.. అప్పుడు కోర్టుకు రావాలని.. పేర్కొంది.
ఇదేసమయంలో నాటి తొక్కిసలాట ఘటనపై అటు టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు, ఇటు స్టాలిన్ ప్రభుత్వా నికి కూడా కోర్టు మొట్టికాయలు వేసింది. ఇంత పెద్ద ర్యాలీని నిర్వహిస్తున్నప్పుడు.. అసలు మీరెందుకు అనుమతి ఇచ్చారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఉండాల్సిన సంఖ్యలో పోలీసులు కూడా లేరని వ్యాఖ్యా నించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ.. టీవీకే పార్టీని హెచ్చరించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని కోర్టు స్పష్టం చేసింది. ఇక, చనిపోయిన వారికి పరిహారం చేతులు దులుపుకోవడం వరకే పరిమితం కావడం ఏంటని ప్రశ్నించింది.
అదేసమయంలో విజయ్.. తన ర్యాలీకి భారీ సంఖ్యలో ప్రజలను తరలించారన్న వాదనపై కోర్టు మండి పడింది. ఏం ఆశించి.. ఇంత పెద్ద జనసమీకరణకు పూనుకొన్నారని నిలదీసింది. మీ రాజకీయం కోసం సామాన్యుల ప్రాణాలను బలిపెడతారా? అని ప్రశ్నించింది. 10 వేల మందికి మాత్రమే అనుమతి తీసు కుని.. 50 వేల మందిని ఎందుకు పోగు చేశారని నిలదీసింది. జనాలు వచ్చే వరకు ఎందుకు వేచి ఉన్నారని కూడా ప్రశ్నించింది.
షెడ్యూల్ ప్రకారం ర్యాలీ నిర్వహించాలన్న బాధ్యత మీకు లేదా? అని టీవీకే అధ్యక్షుడి తరఫున న్యాయ వాదిపై నిప్పులు చెరిగింది. ఇక, షెడ్యూల్ ప్రకారం సభను నిర్వహించనప్పుడు.. మీరు ఎందుకు ఊరుకు న్నారని.. రాష్ట్ర డీజీపీని ప్రశ్నించింది. దీనిపై తదుపరి ఉత్తర్వులు ఇస్తామని, క్రౌడ్ మేనేజ్‌మెంటు విషయంలో రాష్ట్ర పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. ``ఎవరికి వారు తప్పు మాది కాదంటే మాది కాదంటున్నారు. అంటే.. మీకుబాధ్యత లేదని తెలుస్తోంది. మీకు బాధ్యత ఎలా గుర్తు చేయాలో మాకు తెలుసు`` అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.