చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో సంచలనం చోటు చేసుకుంది. బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ సింగపూర్ నుంచి చెన్నై వస్తూ విమానాశ్రయంలో అధికారుల చేతికి దొరికిపోయారు. తనిఖీల్లో భాగంగా అతడి ట్రాలీ బ్యాగ్ నుంచి రూ.40 కోట్లు విలువైన మాదకద్రవ్యాల్ని పట్టేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. 32 ఏళ్ల ఈ బాలీవుడ్ నటుడ్ని చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేసి.. భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవటంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
అనుమానాస్పదంగా ఉన్న అతడి ట్రాలీ బ్యాగ్ నుంచి రూ.40 కోట్లు విలువైన మెథాక్వాలోన్ అనే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అసోంకు చెందిన విశాల్ బ్రహ్మ.. 2019లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2లో చిన్న పాత్ర పోషించటం ద్వారా అతడి కెరీర్ షురూ అయ్యింది. సింగపూర్ నుంచి చెన్నైకు వస్తున్న వేళ.. ఇతడి లగేజ్ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది
ఈ భారీ స్మగ్లింగ్ వెనుక నైజీరియన్ మూఠా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అతడి ఆర్థిక సమస్యలను అసరాగా చేసుకొని.. అతడికి తెలీకుండానే ఇంత భారీ ఎత్తున డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎయిర్ పోర్టు స్కానర్ లో అతడి ట్రాలీ బ్యాగ్ లో అనుమానాస్పదంగా కనిపించిన వస్తువులకు అలెర్టు అయిన విమానాశ్రయ అధికారులు.. అతడ్ని ఆపి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.40 కోట్ల విలువైన మాదకద్రవ్యాల్ని సొంతం చేసుకున్నారు.
తమ వ్యూహంలో భాగంగా ఈ బాలీవుడ్ నటుడ్ని నైజీరియన్ గ్యాంగ్ కాంబోడియా విహారయాత్రకు ఆహ్వానించి ట్రాప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చే వేళలో ఒక బ్యాగ్ చేతికి ఇచ్చి తీసుకెళ్లాలని కోరటంతో.. తాను తీసుకొచ్చినట్లుగా పోలీసులకు విశాల్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి అతడ్నిఅరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. అతడి మొబైల్ ఫోన్.. ల్యాప్ టాప్ ను పరిశీలిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో మాస్టర్ మైండ్ గా ఉన్న చెన్నైలోని నైజీరియన్ల ముఠాను అదుపులోకి తీసుకొనేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి.. వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక సమస్యలతో ఉండే చిన్ననటుల్ని గుర్తించి.. వారికి ప్రత్యేక విహారయాత్రల పేరుతో ఎరవేసి ఇందులో ఇరికిస్తున్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఉదంతంపై మరింత లోతుగా విచారిస్తున్నారు.