ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కన్నడ అమ్మాయి రుక్మిణి వసంత్. రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి’లో రుక్మిణి అందం, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ యువ ప్రేక్షకుల హృదయాలు దోచింది రుక్మిణి. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి.
ఐతే చేతికి వచ్చిన సినిమానల్లా ఒప్పుకుంటూ పోవడంతో రుక్మిణికి షాకులు తప్పలేదు. తెలుగులో నిఖిల్ సరసన నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ కనీసం రిలీజైనట్లు కూడా జనాలకు తెలియలేదు. తమిళంలో విజయ్ సేతుపతి సరసన నటించిన ‘ఏస్’ డిజాస్టర్ అయింది. కన్నడలో కూడా ఆమె నటించిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇలాంటి టైంలో రుక్మిణి ఆశలన్నీ ‘కాంతార: చాప్టర్-1’ మీదే నిలిచాయి. ఇందులో కనకవతి అనే రాణి పాత్రలో నటించింది రుక్మిణి.
నిన్న రిలీజైన ‘కాంతార: చాప్టర్-1’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. రుక్మిణికి అన్ని రకాలుగా మంచి పేరు సంపాదించి పెడుతోంది. సినిమాలో హీరో రిషబ్ శెట్టికి దీటైన పాత్రలో రుక్మిణి కనిపించింది. కథలో కీలక మలుపుకు ఆ పాత్రే కారణమవుతుంది. రాణిగా ఎంతో అందంగా కనిపించి మెప్పించిన రుక్మిణి.. నటిగానూ బలమైన ముద్ర వేసింది.
సినిమా చూసిన వాళ్లంతా రిషబ్ శెట్టి తర్వాత కొనియాడుతున్నది రుక్మిణినే. రిషబ్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ ముందు అసలు ఎవ్వరూ నిలిచే పరిస్థితి లేదు. కానీ రుక్మిణి మాత్రం తన ఉనికిని బాగానే చాటుకుంది. నెగెటివ్ షేడ్స్‌ను కూడా బాగా చూపించడంతో ఆ పాత్ర ఇంపాక్ట్ పెరిగింది. దీని తర్వాత రుక్మిణి నుంచి ‘డ్రాగన్’ సహా భారీ చిత్రాలు రానుండడంతో ఇండియన్ బాక్సాఫీస్‌లో ఆమె పేరు మార్మోగడం ఖాయం.