సైబర్ క్రైమ్, సైబర్ అబ్యూజ్‌కు ఎవ్వరూ అతీతులు కారు అనడానికి ఇది ఉదాహరణ. ఆన్ లైన్లో అప్రమత్తంగా లేకపోతే ఎంతటి వారికైనా చిక్కులు తప్పవనడానికి స్వయంగా తన ఇంట్లో జరిగిన ఒక ఉదంతాన్ని పంచుకున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఆన్ లైన్లో గేమ్ ఆడుతూ.. తన కూతురు ఎలా అబ్యూజ్‌కు గురైందో అతను ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు.
అక్షయ్, ట్వింకిల్ ఖన్నాల తనయురాలు నిటారా.. కొన్ని నెలల కిందట ఆన్ లైన్లో గేమ్ అడుతుండగా.. ఆమెతో కొంత వరకు మామూలుగానే మాట్లాడిన అవతలి వ్యక్తి, తర్వాత అతడి వికృత రూపాన్ని బయటపెట్టాడట. ముందు నువ్వు అమ్మాయా, అబ్బాయా అని అడిగిన ఆ వ్యక్తి.. ఆమె అమ్మాయే అని తెలిసిన తర్వాత, కొంత సంభాషణ అనంతరం నిటారాను న్యూడ్ ఫొటోలు అడిగాడట. వెంటనే ప్రమాదాన్ని గుర్తించిన నిటారా.. గేమ్ ఆపేసి, ఫోన్ స్విచాఫ్ చేసి తన తల్లి దగ్గరికి వెళ్లి విషయం చెప్పిందట.