ఏపీ సీఎం చంద్రబాబు అక్టోబర్ 22-24 వరకు దుబాయ్, అబుదాబిలలో పర్యటించనున్నారు. అక్టోబర్ 24న మెగా తెలుగు డయాస్పోరా ఈవెంట్ లో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 24న దుబాయ్‌లోని ది ఇండియన్ హై స్కూల్‌లోని షేక్ రషీద్ ఆడిటోరియంలో మెగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం జరగనుంది. 2024లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారి దుబాయ్ లో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (CII) సహకారంతో ఈ ఏడాది నవంబర్‌లో ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సును నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. పెట్టుబడిదారులను ఒకచోట చేర్చి ఏపీలో పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఆ సదస్సు సన్నాహాలలో భాగంగా ఏపీ ఆర్థిక అభివృద్ధి బోర్డు (EDB), సీఎం చంద్రబాబు, మంత్రులు టి.జి.భరత్, బీసీ జనార్ధన్‌రెడ్డి, APNRT అధ్యక్షుడు డాక్టర్ రవి కుమార్ వేమూరులు అక్టోబర్ 22 నుండి 24 వరకు దుబాయ్ మరియు అబుదాబిలలో పర్యటించనున్నారు. రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, రవాణా, ఆహార పరిశ్రమ, కృత్రిమ మేధస్సు(AI), ఆర్థిక సేవలు వంటి వ్యూహాత్మక రంగాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంపై ఫోకస్ చేస్తుంది.
ఈ కార్యక్రమానికి గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ఎన్నారైలు భారీ సంఖ్యలో హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే 5 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయని టీడీపీ ఎన్నారై గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధా కృష్ణ రవి ప్రకటించారు. ఈ డయాస్పోరా కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందస్తు రిజిస్ట్రేషన్, చెల్లుబాటయ్యే ఐడీ ప్రూఫ్ తప్పనిసరి. భద్రతా ప్రోటోకాల్‌ల పాటించి స్వచ్ఛంద సేవకులతో సహకరించాలని నిర్వాహకులు కోరారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఏపీఎన్ఆర్టీ మరియు టీడీపీ ఎన్నారై గల్ఫ్ కౌన్సిల్ పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీడీపీ ఎన్నారై గల్ఫ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రాధా కృష్ణ రావు మార్గదర్శకత్వంలో ఎన్నారై టీడీపీ నాయకులు విశ్వేశ్వరరావు, తులసి కుమార్, వాసు రెడ్డి, రాజా రవి కిరణ్ , సునీల్ కుమార్ తదితర సభ్యులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.