అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఏపీ మాజీ సీఎం జగన్..వీరిద్దరూ తమ తమ స్థాయిలలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన వారే. స్వభావ రీత్యా కూడా ఈ ఇద్దరిలో చాలా పోలికలున్నాయి. తనకు ఏ మాత్రం అర్హత లేకున్నా నోబెల్ శాంతి బహుమతి కావాలని ట్రంప్....ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కావాలని జగన్...చిన్న పిల్ల మాదిరిగా పేచీ చేస్తున్నారు. అందుకే, ఈ ఇద్దరు పేచీకోర్ల పేర్లు ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
నోబెల్ బహుమతి ఒకరికి ఇవ్వాలి అంటే కమిటీ ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంది. అందులోనూ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే నియమనిబంధలన్నీ పక్కాగా చెక్ చేసుకుంటుంది. కానీ, ట్రంప్ నకు ఆ కమిటీ నియమనిబంధనలతో సంబంధం లేదు. దేశాల మధ్య సౌభ్రాతృత్వం, సైన్యాల తగ్గింపు కోసం కృషి చేసిన వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. రాజకీయ ఒత్తిళ్లు, లాబీయింగ్ లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ శాంతి బహుమతి ఎంపిక ఉంటుంది.
కానీ, ట్రంపన్న మాత్రం నోబెల్ శాంతి బహుమతి నాకు ఇవ్వాల్సిందే అంటూ చిన్న పిల్లాడు లాలీపప్ కావాలని మారాం చేసిన మాదిరి మారాం చేస్తున్నారు. ఇండో పాక్ యుద్ధంతో కలిపి 7 యుద్ధాలు సింగిల్ హ్యాండ్ తో ఆపానని...తాజాగా గాజా, ఇజ్రాయెల్ ల మధ్య శాంతి ప్రణాళికతో మరో యుద్ధం ఆపబోతున్నానని ట్రంప్ చెబుతున్నారు. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకుంటే తనకు కాదు అమెరికాకు పెద్ద అవమానం అంటూ లోకల్ సెంటిమెంట్ కూడా రెచ్చగొట్టారు ట్రంప్.
ఇలా బహిరంగంగా నాకు నోబెల్ ఇవ్వండి అని డిమాండ్ చేసిన తొలి వ్యక్తి ట్రంప్. ఐన్‌స్టీన్ వంటి వ్యక్తికే ప్రపంచమంతా డిమాండ్ చేసినా నియమనిబంధనలకు లోబడి లేకపోవడంతో ఆయనకు కమిటీ నోబెల్ ఇవ్వలేదు. ఐన్ స్టీన్ కంటే ట్రంప్ గొప్పవాడు కాదుగా.
ఇక, ట్రంపన్నకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఏపీ మాజీ సీఎం జగనన్న డిమాండ్ ఉంది. రాజ్యాంగం తనకు కల్పించని ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం పట్టుబట్టారు జగన్. అంతేకాదు, న్యాయం చేయాలంటూ హైకోర్టు గడప కూడా తొక్కారు. సభా నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెబుతున్నా జగన్ మాత్రం ట్రంప్ కన్నా ఘోరంగా మంకుపట్టు పడుతున్నారు. ఈ ఇద్దరు పేచీకోర్ల కళ్లు తెరుచుకొని వాస్తవాలను గ్రహించాలని కోరుకుందాం. పేచీ చేయడంలో ట్రంప్ తో పోటీపడుతున్న జగన్ కు కనువిప్పు కలగాలని ఆశిద్దాం.