స్వచ్ఛాంధ్రప్రదేశ్...95's సీఎం చంద్రబాబు అప్పట్లోనే ఎంతో ముందుచూపుతో చేపట్టిన కార్యక్రమం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటుందని అప్పట్లోనే ప్రజల్లో చైతన్యం చేపట్టేందుకు చంద్రబాబు ఆ ఆలోచన చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ 2014లో స్వచ్ఛ భారత్ నినాదాన్ని దేశవ్యాప్తంగా పాపులర్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు 2024లో ఏపీలో చంద్రబాబు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకొని పారిశుధ్య సిబ్బందిని అభినందిస్తున్నారు. వారికి అవార్డులు కూడా అందించి ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో ఏర్పాటు చేసిన స్వచ్ఛత అవార్డుల కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా టెర్రరిస్టులను ఏరి వేసిన సైనికులు....ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చెత్తను ఏరివేసే పారిశుద్ధ్య కార్మికులు వీరులే అని చంద్రబాబు అన్నారు.
స్వచ్ఛ భారత్ కోటాలో కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని అన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల మేర చెత్తను గత ప్రభుత్వం వదిలేసిందని, ఆఖరికి తిరుమలను కూడా అపరిశుభ్రంగా మార్చారని, చెత్త పన్ను వేసి.. చెత్తను వదిలేశారని దుయ్యబట్టారు. 2026 జనవరి 1 నాటికి ఏపీని జీరో వేస్ట్ రాష్ట్రంగా చేసే లక్ష్యంతో మందుకు సాగుతున్నామన్నారు. త్వరలో 100 స్వచ్ఛ రధాలను అందుబాటులోకి తెస్తామన్నారు. స్వచ్ఛాంధ్ర సాధ్యం కాకుండా.. స్వర్ణాంధ్ర సాధ్యం కాదన్నారు.