ఏపీ మాజీ సీఎం జగన్ జనం మధ్య పర్యటిస్తున్నారంటే చాలు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠతో ఏర్పడుతుంది జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ కారు కింద పడి చనిపోయిన ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అంతమంది జనానికి అనుమతి లేదన్నా సరే పోలీసుల మాట లెక్కచేయకుండా జగన్ ఇలా పబ్లిసిటీ కోసం జనాలను పిలిపించుకొని రచ్చ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ విశాఖపట్నం-మాకవరపాలెం రోడ్ టూర్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా సరే జగన్, వైసీపీ నేతలు మాత్రం వెళ్లి తీరతామని అంటున్నారు.
అక్టోబర్ 9న విశాఖ నుంచి మాకవరపాలెం గ్రామానికి రోడ్డు మార్గంలో వెళ్లాలని పోలీసులు అనుమతి కోరారు జగన్. అయితే అదే రోజున ఐసీసీ మహిళల ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ జరగబోతుందని, భద్రతా కారణాల రీత్యా జగన్ టూర్ కు అనుమతివ్వలేమని పోలీసులు చెప్పారు. వైసిపి శ్రేణులు భారీ సంఖ్యలో ర్యాలీగా వెళుతుంటే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించే అవకాశం ఉందని, ప్రజల భద్రత, శాంతి భద్రతల దృష్ట్యా ఆ పర్యటనకు అనుమతి నిరాకరించామని విశాఖపట్నం సిపి శంఖబ్రత బాగ్చీ తెలిపారు.
అనకాపల్లిలోని మాకవరపాలెం దగ్గర మెడికల్ కాలేజీని సందర్శించేందుకు జగన్ రాబోతున్నారు. రోడ్డు మార్గంలో అనుమతి లేదని హెలికాప్టర్ లో వెళ్లాలని జగన్ కు పోలీసులు సూచించారు. కానీ, జగన్ మాత్రం రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి, పోలీసుల మాట లెక్కచేయకుండా ఈసారి కూడా జగన్ రోడ్డు మార్గంలోనే రోడ్ షో చేసుకుంటూ వెళతారా? ప్రమాదాలను కొని తెచ్చుకుంటారా? ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారా? అనేది తేలాల్సి ఉంది.