జగన్ పాలనలో ఏపీకి వచ్చేందుకు ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీలు భయపడిన సంగతి తెలిసిందే. జగన్ దెబ్బకు రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. దీంతో, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లు పాలనను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంపై మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నదని లోకేశ్ విమర్శించారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ను పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. చంద్రబాబు, తాను కలిసి ఏపీలో భారీగా పెట్టుబడులను ఆకర్షించామని అన్నారు. 'బిజినెస్ స్టాండర్డ్' కోసం రాసిన ప్రత్యేక వ్యాసంలో లోకేశ్ పలు వ్యాఖ్యలు చేశారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని లోకేశ్ అన్నారు. అమరావతి నిర్మాణానికి సింగపూర్ భాగస్వామ్యాన్ని రద్దు చేయడం, అంతర్జాతీయ సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను వెనక్కి తీసుకోవడంతో పెట్టుబడిదారుల విశ్వాసం దెబ్బతిన్నదని ఆరోపించారు. 72 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పనులను జగన్ గాలికి వదిలేశారని, గత ఐదేళ్లలో కేవలం 3 శాతం పనులే జరిగాయని ఆరోపించారు. తన కోసం కట్టిన రూ.550 కోట్ల రుషికొండ ప్యాలెస్ మాత్రమే జగన్ పూర్తి చేసుకున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
గత 17 నెలల్లోనే రూ.10.7 ట్రిలియన్ల విలువైన పెట్టుబడులను ఖరారు చేశామని, ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని లోకేశ్ చెప్పారు. ఎల్జీ, ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి వస్తున్నాయని తెలిపారు. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు నవంబర్ 14, 15 తేదీల్లో వైజాగ్‌లో సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించబోతున్నామని చెప్పారు. మరో రూ.10 ట్రిలియన్ల పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సు ఉంటుందదన్నారు.