కొందరు టీడీపీ కార్యకర్తలు కల్తీ మద్యం తయారు చేయడం, వారిని గుర్తించిన టీడీపీ అధిష్టానం వారిని సస్పెండ్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇదే జగన్ హయాంలో అయితే మంత్రులు మొదలు ఎమ్మెల్యేల వరకు కల్తీ మద్యం ధందా చేశారని ఆరోపణలు వచ్చాయి. కానీ, ఒక్కరిపై కూడా జగన్ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జగన్ హయాంలో కల్తీ, నాసిరకం మద్యం తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నామని చాలామంది వాపోయారు కూడా. కానీ, జగన్ మాత్రం తమ హయాంలో నికార్సయిన మద్యం సరఫరా చేశామని గొప్పలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కల్తీ మద్యం గురించి జగన్ మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వల్లించడం ఒక్కటేనని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్ల పాటు కల్తీ మద్యం నేరగాళ్లకు కొమ్ముకాసి, అరాచకాలకు పాల్పడిన జగన్ ఎన్ని జన్మలెత్తినా తన లిక్కర్ స్కాం పాపాలను కడుక్కోలేరని అన్నారు. జగన్ హయాంలో రూ.3,500 కోట్ల విలువైన మద్యం కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.
నాణ్యత లేని 'జే బ్రాండ్' మద్యాన్ని ప్రజలపై రుద్ది వేలాది మంది ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీసి, ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు మొత్తం వైసీపీ నేతల చేతుల్లో పెట్టుకుని వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మద్యం విధానంలో పారదర్శకంగా వ్యవహరిస్తోందని సోమిరెడ్డి స్పష్టం చేశారు. జనం నచ్చిన బ్రాండ్లను ఎంచుకునే స్వేచ్ఛ, డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం వంటివి తమ ప్రభుత్వంలోనే సాధ్యమన్నారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో జగన్ ఇంత పచ్చి అబద్ధాలు ఆడే నాయకుడు మరొకరు లేరని ఎద్దేవా చేశారు.