రాజకీయాల్లో విశ్వసనీయత, నమ్మకం అనేది.. అత్యంత ముఖ్యమని వైసిపి అధినేత జగన్ గతంలోనూ ఇప్పుడు కూడా పదేపదే చెబుతున్న విషయం. అయితే, ఏదైతే అయన నమ్ముకున్నారో ఆ విశ్వసనీయతే ఇప్పుడు వైసీపీ నాయకులకు అగ్నిపరీక్ష గా మారింది. ఒకప్పుడు వైసిపి నాయకులు చెప్పింది నిజమని నమ్మే పరిస్థితి ఉండేది. కానీ, రాను రాను వైసిపి నాయకులు చెప్పిన మాటలను ఎవరు విశ్వసించే పరిస్థితి లేకుండా పోయింది అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.
ముఖ్యంగా బలమైన మీడియా రంగంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న వైసిపి సొంత మీడియా కూడా ఇప్పుడు విశ్వసనీయుత విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వైసిపి అనుకూల మీడియాలో వచ్చిన ఏ వార్తను నమ్మే పరిస్థితి లేదని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుండడం నిజానికి ఇబ్బందికర పరిణామమనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం మారిన వాతావరణంలో మీడియా పరంగా ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
గడిచిన దశాబ్ది కాలంలో రాజకీయ నాయకులు చేస్తున్న ఖర్చులలో మీడియాపై వెచ్చిస్తున్నది దాదాపు 60 శాతం గా ఉందని సర్వేలు చెబుతున్నాయి. అంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కూడా మీడియాపై ఖర్చు పెడుతున్న సొమ్ము నూటికి 60 రూపాయలుగా ఉంది. అంతా బలమైన ప్రచారం చేస్తున్నప్పటికీ వైసీపీ విషయంలో మాత్రం విశ్వసనీయత కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా జగన్ విషయంలో ఒకప్పుడు విశ్వసనీయత అనే మాట వినిపించేది.
కానీ, రాను రాను ఇది తగ్గిపోతూ వస్తోంది. సొంత పార్టీ నాయకులు లేదా రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టినా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల్లో జగన్కు ఒక క్రెడిబిలిటీ అయితే ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అది లేకుండా పోతోంది. ఇదే పరిణామం కొనసాగితే వైసిపి ఫేడ్ అవుట్ అయినా ఆశ్చర్యం లేదన్నది విశ్లేషకుల వాదన. నిజానికి గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను నమ్మొద్దని జగన్ ప్రచారం చేశారు. తాను నిబద్ధతకు నిదర్శనమని, తాను చెప్పింది వాస్తవాలంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.
తల్లికి వందనంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తామని చంద్రబాబు చెప్పగా జగన్ అలా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఇక, ఉచిత ఆర్టీసీ బస్సు విషయంలోనూ ఆయన ఇదే వాదన లేవనెత్తారు. అంతేకాదు ఇప్పటికే ఇస్తున్నవి కొనసాగిస్తాం తప్ప మరిన్ని ఇవ్వలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. తనను నమ్మాలని కూడా ఆయన చెప్పారు. అయితే, అప్పటివరకు ఆయన చెప్పింది ఎలా ఉన్నప్పటికీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం జగన్ పట్ల విశ్వాసం ఎంత అనేది ఫలితాన్ని బట్టి అర్థమైంది.
ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాలు, ఇస్తున్న సంక్షేమం వంటివి ఎక్కడ తగ్గకపోగా ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది పిల్లలకీ 15 వేల రూపాయలు చొప్పున ఇచ్చారు. చెప్పినవి, చెప్పనివి కూడా అమలు చేస్తున్నారు. ఇదే.. వైసిపి విశ్వసనీయతకు గొడ్డలిపెట్టుగా మారింది. నిజానికి జగన్ చెప్పిందే వాస్తవం అయి ఉంటే కూటమి ప్రభుత్వం తాజాగా ఆటో డ్రైవర్లకు సేవలో పథకాన్ని అమలు చేసేందుకు ముందుకు వచ్చేది కాదు. పైగా 436 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని వారికి పంపిణీ చేసింది. అది కూడా ఒక్కరోజులోనే.
ఈ పరిణామాలు తర్వాత ఇప్పుడు మరింత బలంగా ప్రజల్లో జగన్ విశ్వసనీయత.. వైసిపి మీడియా విశ్వసనీతపై అనేక సందేహాలు వస్తున్నాయి. నమ్మలేని పరిస్థితి కూడా ఎదురవుతోంది. దీని నుంచి బయటపడాలి అంటే కచ్చితంగా వైసీపీ మళ్ళీ జీరో లెవెల్ నుంచి తన రాజకీయాలను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేస్తారనేది చూడాలి. ఏదేమైనా రాజకీయాల్లో విశ్వసనీయతను సంపాదించుకోవడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం అన్నది వైసిపి విషయంలో స్పష్టం అవుతోంది.