కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత గోగినేని శివరామకృష్ణ (60) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం శివరామకృష్ణ హఠాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. అప్పటి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించి బుధవారం నాడు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఈ నెల 10న బాపులపాడు మండలంలోని అంపాపురంలో శివరామకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శివరామకృష్ణ మృతిపట్ల పలువురు టీడీపీ నేతలు, టీడీపీ ఎన్నారై నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
బాపులపాడు మండల టీడీపీ కీలక నేతగా శివరామకృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హనుమాన్ జంక్షన్ టీడీపీ కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలోనే ఉన్నారు. తెలుగు యువత నాయకుడిగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుబెట్టారు. యువనేతగా కొద్ది కాలంలోనే పార్టీలో మంచి గుర్తింపు పొందారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వడ్డే శోభనాద్రీశ్వరరావు వంటి కీలక నేతలకు అత్యంత సన్నిహితుడిగా ఆయన పేరు పొందారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమ యంలో విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ విజయం కోసం శివరామకృష్ణ విశేష కృషి చేశారు.