తెలంగాణలో ఆ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

admin
Published by Admin — October 09, 2025 in Telangana
News Image
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ జారీ చేసిన జీవో నెంబర్‌ 9పై హైకోర్టు స్టే విధించింది. దాంతోపాటు, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌పై కూడా స్టే విధించింది. అంతేకాదు, 2 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆర్డర్‌ కాపీ పరిశీలించిన తర్వాత ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.


తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ విచారణ సందర్భంగా కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. తెలంగాణలో బీసీలు 56.7% ఉన్న సంగతి వాస్తవమేనని, కానీ, రాజ్యాంగబద్ధంగా వారికి 42 శాతం రిజర్వేషన్ కల్పించడం సబబు కాదని పిటిషనర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. అయితే, ఆ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని, గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే అది చట్టమవుతుందని ప్రభుత్వం తరఫు లాయర్ వాదించారు.

Tags
Telangana High Court Stay 42 percent reservations bc community local body elections
Recent Comments
Leave a Comment

Related News