అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్న ట్రంపునకు నిరాశ తప్పలేదు. తనకు నోబెల్ శాంతి బహుమతి రాదేమో అని నిన్న ట్రంప్ నిట్టూర్చినప్పుడే ఆయనకు ఛాన్స్ లేదని దాదాపుగా అర్థమైంది. ఆ క్రమంలోనే వెనిజులా ఉద్యమకారిణి మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. దీంతో, ట్రంప్ కు ఊహించిన షాక్ తగిలినట్లయింది.
వెనిజులా విపక్ష నేత మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి అందిస్తున్నట్లు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. నియంతృత్వ శృంఖలాల నుంచి తన ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు అలుపెరుగని పోరాటం చేసిన ధీర వనితకు ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. ఈ ఏడాది ట్రంప్ సహా 338 మంది నోబల్ శాంతి బహుమతి కోసం పోటీపడ్డారు. అయితే, శాంతియుత మార్గంలో వెనిజులా ప్రజల హక్కుల కోసం ఆమె చూపిన తెగువ, పడ్డ ఇబ్బందులు ఆమెకు నోబెల్ శాంతి బహుమతిని తెచ్చిపెట్టింది.
ఈ అవార్డు దక్కడంపై ఆమె స్పందించారు. తనకు మాటలు రావడం లేదని, వెనిజులా ఉద్యమంలో తానొక భాగం మాత్రమేనని భావోద్వేగానికి లోనయ్యారు. నోబెల్ శాంతి బహుమతి ఘనత వెనిజులా ప్రజలందరిదీ అని, తనది మాత్రమే కాదని ఆమె ఎమోషనల్ అయ్యారు.