ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వైసిపి నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే వైసిపి అధినేత, మాజీ సీఎం జగన్ ఈ రోజు ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే జగన్ పర్యటనను దళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దివంగత డాక్టర్ సుధాకర్ ఫ్లెక్సీలతో జగన్ కు దళిత సంఘాల నేతలు స్వాగతం పలికారు.
మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసిన వాళ్ళు మెడికల్ కాలేజీ ల గురించి మాట్లాడటమా? ప్రజలూ... తస్మాత్ జాగ్రత్త! అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. మాకవరపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించేందుకు జగన్ ఈరోజు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ రాకుండా వ్యతిరేకిస్తున్న దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేసినందుకు సిద్ధమయ్యాయి. వైసిపి హయాంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో డాక్టర్ సుధాకర పీపీఈ కిట్ అడిగిన పాపానికి ఆయనను మానసికంగా వేధించారని దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ వేధింపుల వల్లే సుధాకర్ మానసిక ఒత్తిడికి గురై, ఆరోగ్యం పాడై చనిపోయారని ఆరోపించారు. సుధాకర్ మరణానికి గత ప్రభుత్వమే కారణమని దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోబ్యాక్ జగన్ నినాదాలతో దళిత సంఘాలు భారీ మానవ హారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశాయి. సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.