తమ్ముడు తన వాడైనా ధర్మం పాటించాలన్నది.. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలకు విస్తృత ప్రయోజనం కల్పించేదే అయినా.. నేడు రాజకీయ ముసుగు పడిపోతోంది. తెరతీయగరాదా! అని అంటు న్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. బాధ్యతా యుత మీడియా సంస్థలు కూడా.. మోచేతి నీళ్లు తాగిన చందంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అసలు ఏది నిజం? ఏది అబద్ధం? అంతకుమించి ఏది పాపం? అనేది తెలుసుకునేందుకు ప్రజలకు చాలా సమయం పడుతోంది.
ఏపీలో ప్రస్తుతం మెడికల్ కాలేజీల వ్యవహారం రాజకీయ దుమారంగా మారింది. ఓ పక్షం మీడియా.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై దుమ్మెత్తిపోస్తోంది. రాజకీయంగా ఎలా చేసుకున్నా.. ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, ప్రజల కోణాన్ని కూడా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది కదా? కానీ.. దానిని వదిలేసి.. వైసీ పీ హయాంలో అసలు మెడికల్ కాలేజీలను తీసుకురావడమే తప్పన్నట్టుగా వ్యవహరించడం.. మసిపూసి మారేడు కాయను చేసేలా అబద్ధాలు, అర్ధసత్యాలతో ప్రజలకు మేలైన నిర్ణయాన్ని కూడా.. తప్పుడు నిర్ణయంగా చూపించే ప్రయత్నం చేయడం.. నిజంగా ఏపీని పట్టి పీడిస్తున్న దరిద్రమేనని చెప్పాలి.
విషయం ఏంటి?
జగన్ హయాంలో కేంద్రం నుంచి 17 కాలేజీలకు అనుమతి తెచ్చారు. ఆ సమయంలో తెలంగాణకు కూడా కనీసంలో కనీసం 4 మెడికల్ కాలేజీలు ఇవ్వాలనిఅప్పటి సీఎం కేసీఆర్ కోరినా..కేంద్రం ఇవ్వలేదు. ఏపీకి ఏకంగా 17 కాలేజీలు ఇచ్చింది. వీటిని 60:40 విధానంలో నిధులు వెచ్చించి.. `దశల` వారీగా పూర్తి చేయా ల్సి ఉంది.ఇలా.. తొలి 2023-24 నాటికి 5 కాలేజీలను పూర్తి చేయాల్సి ఉందని కేంద్రమే చెప్పింది. దీనిని అప్పటి వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసింది.
ఆ తర్వాత.. 2027, 2029 నాటికి విడతల వారీగా 12 కాలేజీలను పూర్తి చేయాలి. అలానే కేంద్రం కూడా నిధులు ఇస్తుంది. ఇప్పుడు వాటిపైనే అలుపెరుగని రాజకీయం సాగుతోంది. ఈ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సింది.. 8-10 వేల కోట్లు. కానీ, ఈ సొమ్ము లేదని ప్రభుత్వం చెబుతోంది. సరే.. పీపీపీ విధానానికి ఇవ్వాలని అనుకున్న నేపథ్యంలో సర్కారు తీసుకున్న రూట్‌ను ఎవరు తప్పుబట్టినా.. తప్పుబట్టకపోయినా.. జరగాల్సింది జరుగుతుంది.
కానీ, అసలు జగన్ సదరు 17 కాలేజీలను గత ఐదేళ్లలో పూర్తి చేయలేదని.. పునాదులు కూడా దాటలేదని.. కొన్ని కాలేజీలకు అంస్థులు నిర్మించినా.. వాటిని పూర్తి చేయలేదని.. ఇలా ఓ వర్గం మీడియా పేర్కొంటోం ది. అంతేకాదు.. పచ్చని భూములు ఈ నిర్మాణాలకు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. మరి అమరావతికి ఎలాంటి భూములు తీసుకుంటున్నారో.. కూడా చెప్పాలి కదా!. ఈ అసలు వాస్తవం తెలియదా? అంటే.. తెలుసు. తెలిసి కూడా.. ప్రజలను మోసం చేసే క్రతువులో కృత నిశ్చయులుగా పనిచేస్తున్నారు.
ఏంటీ వాస్తవాలు..
+ కేంద్రం ఇచ్చిన 17 కాలేజీలను విడతల వారీగా పదేళ్లలో పూర్తి చేయాలి.
+ 2021 కరోనా అనంతరం.. పెద్ద ఎత్తున ప్రజలు చనిపోయిన దరిమిలా.. దేశవ్యాప్తంగా వైద్య కాలేజీలను సదుపాయాలను పెంచాలని కేంద్రం కళ్లు తెరిచింది.
+ ఆ క్రమంలోనే కేంద్రానికి రెండు రాజ్యసభ సీట్లు సమర్పించి.. వైసీపీ 17 కాలేజీలకు అనుమతులు తెచ్చుకుంది. వీటిలో 40 శాతం నిధులను రాష్ట్రం భరించాలి.
+ ఆ ప్రాతిపదికన.. కళాశాలల నిర్మాణం చేపట్టారు.
+ 17 కాలేజీల్లో కేవలం 2 మాత్రమే పునాదుల దశను దాటలేదు. మిగిలిన 15 కాలేజీల్లో 5 పూర్తయి.. తరగుతులు కూడా జరుగుతున్నాయి. మిగిలిన 10 కాలేజీలు.. నిర్మాణాలు పూర్తి చేసుకుని.. మౌలిక సదుపాయాలకు రెడీగా ఉన్నాయి.( ఈ విషయం సదరు మీడియా ప్రచురిస్తున్న ఫొటోలను చూసినా.. అర్ధమవుతుంది)
+ కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఈ కాలేజీలు మాకు వద్దని కేంద్రానికి లేఖ రాసింది.
+ అయితే.. ఇప్పటికే ఇచ్చిన సొమ్ములు తమకు తిరిగి ఇచ్చేయాలని కేంద్రం మెలిక పెట్టింది. అంతేకాదు.. వచ్చే 20 ఏళ్ల వరకు ఒక్క కాలేజీని కూడా కేటాయించే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో వెనక్కి తగ్గారు.
కొసమెరుపు:
రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన.. రాష్ట్రప్రజలకు భారీ మేలు చేసే మెడికల్ కాలేజీల వ్యవహారంలో వాస్తవాలను వివరించి.. తన వంతు సాయం చేయాల్సిన మీడియా.. తప్పుడు.. అర్ధసత్య కథనాలను వండి వార్చడంపై.. మేధావులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ నిపుణులు, వైద్య రంగం వారు.. కూడా మెడికల్ కాలేజీల విషయంలో జరుగుతున్న రాద్ధాంతాన్ని తప్పుబడుతున్నారు.