శాసన సభ స్పీకర్ స్థానానికి ఒక గౌరవం ఉంది. అసెంబ్లీలో సభ్యులెవరైనాగానీ...ఆఖరికి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అయినా సరే ఆయనకు మర్యాద ఇవ్వాల్సిందే. కానీ, అటువంటి స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడును ఉద్దేశించి పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన తాజాగా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు సిగ్గు లేదా..ఆయన సిగ్గు పడాలి అంటూ చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి. దీంతో, జగన్ పై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, స్పీకర్ ను అవమానిస్తే గతంలో కరణం బలరాంపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు వారు గుర్తు చేస్తున్నారు. జగన్ తండ్రి వైఎస్ఆర్ చూపిన బాటలోనే జగన్ పై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా కొనసాగుతున్నారు. ఆ రోజుల్లో టీడీపీ శాసనసభ్యుడు కరణం బలరాం ఒక రాజకీయ సభలో ప్రసంగిస్తూ "సభలో స్పీకర్ గారు నియంతలా వ్యవహరిస్తున్నారు, ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు అని వ్యాఖ్యానించారు.
దీంతో, ఆ వ్యాఖ్యలు స్పీకర్ స్థానం గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని వైఎస్ ఆర్ అన్నారు. దీంతో, కరణం బలరాం మీద అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో, కరణం బలరాం శాసనసభ సభ్యత్వాన్ని 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. దీంతో, జగన్ పై కూడా అదే మాదిరిగా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.