లూలూ కంపెనీ వస్తోంది.. పెట్టుబడులు తెస్తోంది.. అని ఏపీ ప్రభుత్వం నిన్న మొన్నటి వరకు పెద్ద ఎత్తు న ప్రచారం చేసింది. వాస్తవానికి లూలూ కంపెనీ అంతర్జాతీయ సంస్థ. ఇది అరబ్ దేశమైన అబుదాబి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే.. ఈ కంపెనీతో వచ్చిన పెద్ద చిక్కు.. తాము చెప్పిన నిబం ధనలు పాటించాలని ఒత్తిడి చేయడమే. అయితే.. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు సమాచారం ఉందో లేదో తెలియదు కానీ... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ..మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని ప్రశ్నలు లేవనెత్తే సరికి ఒకింత ఇబ్బంది ఏర్పడింది.
ఏపీలో లూలూ కంపెనీ మూడు చోట్ల మాల్స్, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. విశాఖపట్నంలో 2014-19 మధ్య మాల్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కానీ, వైసీపీ హయాంలో దీనిని రద్దు చేయడంతో లూలూ వెనక్కి వెళ్లిపోయింది. దీనిపై సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో తీవ్ర ప్రచారం చేసుకున్నారు. వైసీపీ వెళ్లగొట్టింది.. మేం తెచ్చాం.. అంటూ ప్రజలకు వివరించారు. ఇక, ఇప్పుడు అక్కడే ఈ మాల్ పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో పాటు విజయవాడ ప్రధాన బస్టాండ్‌కు కిలో మీటరు దూరంలో ఉన్న పాత బస్టాండ్‌ను కూడా లూలూకు ఇవ్వాలన్నది కీలక ప్రతిపాదన. ఇక్కడ కూడా ఆ సంస్జ మాల్‌ను ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మల్లవల్లిలో ఉన్న పారిశ్రామిక పార్క్‌లో కూడా లూలూకు 7.5 ఎకరాలను కేటాయించారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఇక్కడ లూలూ కంపెనీ.. కోర్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అయితే.. ఈ యూనిట్‌లో గోవుల మాంసాన్ని ప్రాసెస్ చేస్తారన్నది వార్త.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయినా.. సర్కారు పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అదేవిధంగా లీజుకు ఇచ్చిన భూమి ధరలను నిబంధనల ప్రకారం.. ప్రతి మూడేళ్లకు 10 శాతం చొప్పున పెంచాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఐదేళ్లకు ఒకసారి లీజును కేవలం 5 శాతం పెంచేందుకు వీలుగా జీవోఇచ్చింది. దీనిని కూడా ఆయన నిలదీశారు. ఈ పరిణామాలు సహజంగానే సీఎంకు ఇబ్బంది కలిగించాయి. అయినా.. ఆయన లూలూ.. కంపెనీ ఆవస్యకత ఉందన్నారు. కానీ, డిప్యూటీ సీఎం మాత్రం.. ఈ విషయాన్ని మరింతలోతుగా అధ్యయనం చేసిన తర్వాతే అనుమతులు ఇవ్వాలన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.