ఏపీలోని కూటమి ప్రభుత్వ రథాన్ని రెండు చక్రాలుగా ముందుకు నడిపిస్తున్న టీడీపీ-జనసేన పార్టీల అధిష్టానాలు బాగానే ఉన్నాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కలివిడిగానే కనిపిస్తున్నారు. కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా.. వాటిని సరిచేసుకుంటూ.. ప్రభావం పడకుండా కూడా చూసుకుంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉంటున్నాయన్నది వాస్తవం.
జనసేన ఎమ్మెల్యేలు ఉన్న 21 నియోజకవర్గాల్లో 10 చోట్ల వివాదాలు, విభేదాలు కొనసాగుతున్నాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ విమర్శలు కూడా తెరమీదికి వస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఇరు పార్టీల నాయకులు బాహాబాహీకి కూడా దిగుతున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, పోలవరం నియోజకవర్గాల్లో నాయకుల మధ్య తీవ్ర విభేదాలు కనిపిస్తున్నాయి. మరికొ న్ని నియోజకవర్గాల్లో ఇరు పక్షాల్లోనూ ఆధిపత్య ధోరణి కనిపిస్తోంది.
అయితే.. వీటికి సంబంధించి ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎన్ని వివాదాలు తెరమీదికి వచ్చినా.. పార్టీ అధినేతలు మాత్రం చూసీ చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇది పార్టీలకు మంచి కాదన్నసూచనలు వస్తున్నా.. వారే సర్దుకుంటారు.. అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. అయితే.. ఈ పరిణామాలు ఇప్పుడు మరింత తీవ్రమయ్యాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలంలోని కీలకమైన జనసేన ఎంపీటీసీ విక్రమ్‌పై టీడీపీ నేతలు దాడి చేసినట్టు తెలిసింది.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విక్రమ్‌ను శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. టీడీపీ నాయ కులు.. దాడి చేసిన ఘటనపై జనసేన కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్థానికంగా జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిన కారణంగానే విక్రమ్‌పై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారని వారు ఆరోపిస్తున్నారు. సో. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే, నేతలను సరైన దారిలో నడిపించకపోతే.. ఇరు పార్టీలకూ నష్టమేనని పరిశీలకులు భావిస్తున్నారు.