నారా వారి కుటుంబంలో రెండు అద్భుతాలు ఒకే రోజు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం నారా చంద్రబాబు.. శుక్రవారానికి(అక్టోబరు 10) ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం సహా.. విభజిత ఏపీలో ఆయన ముఖ్యమం త్రిగా పగ్గాలు చేపట్టి 15 ఏళ్లు నిండాయి. ఇదొక అరుదైన రికార్డనే చెప్పాలి. ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ వేదికపై అనేక రూపాల్లో విజృంభించేలా చేసిన.. ఘనతతో పాటు విభిన్న పార్శ్వాలు ఉన్న ఏపీ ప్రజలతో జై కొట్టించుకుని 15 ఏళ్లు ముఖ్యమంత్రి రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు.
ఈ ఆనంద క్షణాల సమయంలోనే నారా కుటుంబానికి మరో అరుదైన అవార్డు లభించింది. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా, సమాజ సేవకురాలిగా గుర్తింపు తెచ్చుకుని, అప్పుడప్పుడు రాజకీయంగా కూడా దూకుడు ప్రదర్శిస్తున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి అరుదైన.. `డిస్టింగ్విష్డ్` ఫెలో షిప్ అవార్డు లభించింది. ఈ ప్రకటన కూడా.. శుక్రవారం సాయంత్రం వెలువడడంతో నారా ఫ్యామిలీలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అవార్డును నవంబరు 4న లండన్‌లో జరగనున్న కార్యక్రమంలో భువనేశ్వరి అందుకోనున్నారు.
ఎందుకు ఇచ్చారు?
`డిస్టింగ్విష్డ్` ఫెలో షిప్ అవార్డును సమాజ సేవలో అగ్రగణ్యంగా రాణిస్తున్న వారికి ఇస్తారు. ఈ ఏడాది ఈ అవార్డుకు నారా భువనేశ్వరిని ఎంపిక చేశారు. లండన్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ.. `ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్` ఈ అవార్డును ఏటా ప్రకటిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా లాభాపేక్షలేని సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా సేవలు చేయడం, లేదా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే కార్యక్రమాలను నిర్వహించడం వంటివాటి ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా లాభాపేక్ష రహితంగా ప్రజలకు సేవ చేస్తున్న నారా భువనేశ్వరిని ఈ ఏడాది ఈ అవార్డుకు ఎంపిక చేయడం గమనార్హం.
ఇప్పటి వరకు ఎవరెవరికి?
`డిస్టింగ్విష్డ్` ఫెలో షిప్ అవార్డును ఏటా ప్రపంచ దేశాల్లోని ప్రముఖులకు అందిస్తారు. ఈ అవార్డును ఇప్పటి వరకు మన దేశంలోని ముగ్గురు మాత్రమే దక్కించుకున్నారు. వీరిలో దివగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో-చైర్మన్ గోపీ చంద్, ఆదిత్య బిర్లా చైర్ పర్సన్ రాజశ్రీ వంటివారికి ఈ అరుదైన అవార్డు లభించగా.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళ నారా భువనేశ్వరి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డు కింద.. భారత కరెన్సీలో కోటి రూపాయల నగదుతో పాటు.. ప్రశంసా పత్రం, మొమెంటో ను అందిస్తారు.