విశాఖలో 1 గిగా వాట్ సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ఎంవోయూ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఒప్పందంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. వికసిత్ భారత్ దిశగా ఇది చరిత్రాత్మక ముందడుగని పవన్ అన్నారు. ఫ్యూచర్ సిటీ విశాఖ నుంచి 'వికసిత భారత్' వైపు ఏపీ ప్రయాణం మొదలుబెట్టిందని అన్నారు. భారతదేశపు తొలి ఏఐ సిటీ ఏర్పాటు నిర్ణయం దేశ టెక్ రంగంలో చరిత్రాత్మక మైలురాయి అని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా యువత, రైతులు, వైద్యులు, మత్స్యకారులు, పారిశ్రామిక వేత్తలు, మహిళలు, విద్యార్థులు అందరికీ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రానుందని చెప్పారు. 'Al for All' దిశగా ఇది ఒక గొప్ప ముందడుగని తెలిపారు. ఈ విజయానికి ప్రధాని మోదీ పునాది వేశారని, 'వికసిత భారత్' లక్ష్యంగా ఆయన దూరదృష్టి, విశ్వాసం ఈ పెట్టుబడికి మార్గం సుగమం చేశాయన్నారు. సీఎం చంద్రబాబుకు ఉన్న నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, నాయకత్వ పటిమ ఈ ప్రాజెక్టును ఏపీకి తీసుకురాగలిగిందని చెప్పారు.