విశాఖలో 1 గిగా వాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ చరిత్రాత్మక ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో జరిగిన ఈ ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం తన రాజకీయ జీవితంలో అతిపెద్ద విజయం అని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మద్దతుతోనే ఇది సాధ్యమైందని, ఆయన ఆలోచనా తీరును ఎవరూ అందుకోలేరని ప్రశంసించారు. 2047 కంటే ముందే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలోనే తొలి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ విశాఖలో ఏర్పాటు కాబోతుండడం సంతోషంగా ఉందన్నారు. దాదాపు 1,33,000 కోట్ల పెట్టుబడితో విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పారు. భారత్ లో ఇదే అతిపెద్ద ఎఫ్డిఐ ప్రాజెక్ట్ అని, దీని ద్వారా రాష్ట్రానికి 48 వేల కోట్ల ఆర్థిక లాభం, దాదాపు 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేశారు.
ఈ ప్రాజెక్టును విశాఖకు తెప్పించడంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ విశేష కృషి చేశారని ప్రశంసించారు. టెక్నాలజీతో తాను ఎన్నో ఏళ్లుగా అనుసంధానమై ఉన్నానని, హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణం మొదలు ఐటీ రంగాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ప్రతి కుటుంబానికి టెక్నాలజీని చేరువ చేయడంతోపాటు వన్ ఫ్యామిలీ వన్ ఎంటప్రెన్యూర్ విధానంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
ఈ ప్రాజెక్టు విశాఖకు వచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారం అందించారని అన్నారు. అమెరికా తర్వాత భారీ పెట్టుబడితో గూగుల్ సంస్థ తన డేటా సెంటర్ ను విశాఖలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఏపీలో విప్లవాత్మక మార్పులకు ఇది నాంది పలుకుతుందని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఈ డేటా సెంటర్ రాకతో ఏపీలో ఐటీ రంగంలో పెను మార్పులు వస్తాయని, గూగుల్ ను చూసి మరిన్ని కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ సెల్ఫీ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.