విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడితో 1 గిగా వాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ కార్యక్రమానికి హాజరైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ టెక్నాలజీ రంగంలో ఇదొక చరిత్రాత్మక ఘట్టమని అన్నారు. రాష్ట్రానికి కాకుండా, భారత దేశ డిజిటల్ ప్రగతికి ఇది అత్యంత కీలకమని అన్నారు. దేశానికి డేటా సెంటర్లు కొత్త రిఫైనరీల వంటివని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే ఏపీలో ఈ పెట్టబడి సాధ్యమైందని ప్రధాని మోదీని కొనియాడారు.
విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో మరిన్ని ప్రాజెక్టులు ఏపీకి రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. డిజిటల్ ఇన్నోవేషన్, ఏఐ రంగాల్లో ఏపీలో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పారు. ఏపీలో రియల్ టైం గవర్నెన్స్ సేవలకు గూగుల్ మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో వన్ గిగావాట్ సామర్థ్యంతో గూగుల్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడంపై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో డిజిటల్ హబ్ గా దేశానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. గ్లోబల్ టెక్ మ్యాప్ పై ఏపీని మరింత బలంగా నిలబెట్టే మైలు రాయి ఇది అని ఆశాభావం వ్యక్తం చేశారు.