2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి ఐటీ కంపెనీలు మొదలు పలు దిగ్గజ పరిశ్రమలు క్యూ కట్టాయి. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన గూగుల్ సంస్థతో ఏపీ ప్రభుత్వం చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 15 బిలియన్ అమెరికన్ డాలర్లు...అంటే దాదాపు 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ సిద్ధమైందని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్ ప్రకటించారు. అమెరికా వెలుపల గూగుల్ నిర్మించబోయే అతిపెద్ద డేటా సెంటర్ ఇది అని చెప్పారు.
భారత ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం సహకారంతో విశాఖలో 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏఐ హబ్ ప్రారంభించబోతున్నామని అన్నారు. భవిష్యత్తులో ఈ సామర్ధ్యాన్ని మరింత విస్తరిస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో విశాఖను కనెక్టివిటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అదే తమ లక్ష్యమని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నామని, విశాఖ నుంచి ఇంటర్నేషనల్ నెట్వర్క్ ను సీ కేబుల్ వ్యవస్థ ద్వారా అనుసంధానించబోతున్నామని ప్రకటించారు.
ఈ కేంద్రంలో అత్యధిక టెక్నాలజీతో కూడిన సెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్లను వాడబోతున్నామని, ఏఐ ప్రాసెసింగ్ వేగాన్ని అవి రెట్టింపు చేస్తాయని అన్నారు. గూగుల్ సెర్చ్, యూట్యూబ్, జీ మెయిల్ వంటి ఎన్నో సేవలను విశాఖ నుంచే ప్రపంచానికి అందించే అవకాశం కలుగుతుందని చెప్పారు. స్థానిక యువతకు శిక్షణనిచ్చి ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దామని అన్నారు. అమెరికా లో కాకుండా గూగుల్ ఏర్పాటు చేయబోతున్న అతిపెద్ద ప్రాజెక్టు విశాఖకు దక్కడం విశేషం.