విశాఖలో 1 గిగా వాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చరిత్రాత్మక ఒప్పందం జరిగిన నేపథ్యంలో భారత ప్రధాని మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఫోన్ లో మాట్లాడారు. ఈ డేటా సెంటర్ భారత దేశంలో ఏర్పాటు చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అందుకు సంబంధించిన విషయాలను ప్రధాని మోదీతో పిచాయ్ పంచుకున్నారు. భారతదేశ ఐటీ రంగంలో ఈ హబ్ కీలక మలుపు కాబోతోందని, ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలవబోతోందని అన్నారు.
ఈ హబ్ లో హైపర్ స్కేల్ డేటా సెంటర్, అంతర్జాతీయ సబ్ సీ గేట్ వే, భారీస్థాయిలో ఇంధన మౌలిక సదుపాయాలు ఉండనున్నాయని చెప్పారు. ఈ హబ్ ద్వారా అధునాతన సాంకేతికతను భారత్ లోని సంస్థలకు, వినియోగదారులకు అందించబోతున్నామని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కరణలను మరింత వేగవంతం చేసేందుకు ఈ హబ్ ఉపయోగపడనుందని అన్నారు.