షూటింగ్‌లు ఆలస్యం.. పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం.. రిలీజ్ ఆలస్యం.. విడుదల తేదీలు మారిపోతూ ఉంటాయి. అది కూడా ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు. తాపీగా రిలీజ్ చేయాల్సిన సినిమాకు కూడా చివరికొచ్చేసరికి హడావుడి తప్పదు.ఇవి చాలవన్నట్లు టీజర్, ట్రైలర్, లేదా సాంగ్.. ఇంకేదో ప్రోమో రిలీజ్ చేయడానికి ఒక ముహూర్తం పెడతారు. టైమ్ అనౌన్స్ చేస్తారు. చివరికి ఆ డెడ్ లైన్లను అందుకోవడం కూడా కష్టమైపోతోంది.
ప్రతి విషయంలోనూ వాయిదాల పర్వం తప్పట్లేదు. ఇది కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూసే ప్రేక్షకులను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. సినిమాల బజ్ మీదా, అలాగే వసూళ్ల మీద కూడా ప్రభావం చూపుతోంది. సోమవారం రెండు సినిమాల నుంచి ప్రోమోల రిలీజ్‌కు ముహూర్తం ప్రకటించారు. ఉదయం 11.34 నిమిషాలకు తెలుసు కదా ట్రైలర్ వస్తుందన్నారు. కానీ కొన్ని గంటలు ఆలస్యం అయింది.
సాయంత్రానికి కానీ ట్రైలర్ లాంచ్ చేయలేదు. 11.34 అంటూ పర్టికులర్ టైం ప్రకటించి.. మళ్లీ ట్రైలర్ లాంచ్ చేయడంలో ఎందుకు ఆలస్యం జరిగిందో టీంకే తెలియాలి. ట్రైలర్ కట్ మారిందని అన్నారు కానీ.. అయినా సరే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దాన్ని త్వరగానే రిలీజ్ చేశారు. కానీ ఆన్ లైన్లో రిలీజ్ చేయడంలో ఆలస్యమైంది. ఇక సాయంత్రం 4.05కి మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ నుంచి మీసాల పిల్ల పాట లిరికల్ వీడియో రిలీజ్ కావాల్సింది. దీని గురించి ముందు రోజే ప్రోమో కట్ చేశారు. తీరా చూస్తే సమయానికి పాట రాలేదు.
వెయిటింగ్ బజ్ పెరిగింది, రేపటి దాకా ఎదురు చూడండి అంటూ తాపీగా టీం పోస్ట్ పెట్టడంతో మెగా అభిమానులకు మండిపోయింది. ముందు చిన్న ప్రోమో రిలీజ్ చేయడం.. ఆ తర్వాత వారం పైగా టైం తీసుకున్నా సమయానికి లిరికల్ వీడియో రిలీజ్ చేయకపోవడం ఏంటి అంటూ అసహనానికి గురయ్యారు. కంటెంట్ రిలీజ్ సంగతి ఇలా ఉంటే.. సినిమాల రిలీజ్‌కు ఒకట్రెండు రోజుల ముందు వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో కుస్తీపడడం, ఓవర్సీస్‌కు సమయానికి కంటెంట్ డెలివరీ చేయకపోవడం ఈ మధ్య మామూలైపోతోంది. ఓజీ విషయంలో ఎంత హడావుడి పడ్డారో తెలిసిందే. దీపావళి సినిమాల్లో కూడా ఒకట్రెండు చిత్రాలకు ఇదే పరిస్థితి తలెత్తేలా ఉంది.