ఓకే గూగుల్...చాలామంది ఫోన్లలో ఈ వాయిస్ కమాండ్ చెబుతుంటారు. తమకు కావాల్సిన పాటలు..ఫోన్లో ఆప్షన్లు...వాయిస్ కమాండ్ ద్వారా పొందుతుంటారు. అయితే, ఇలా ఓకే గూగుల్ అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కమాండ్ ఇస్తే...పాటలు కాదు..పెట్టుబడులు వస్తాయి....సాక్ష్యాత్తూ గూగుల్ సంస్థ వచ్చి వేల లక్ష కోట్లకు పైగా పెట్టుబడి పెడుతుంది...వేలాదిమంది యువతకు ఉద్యోగాలు వస్తాయి...ఒక నగరం రూపురేఖలు మారిపోతాయి. విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ చేసుకున్న రోజు సీఎం చంద్రబాబు ఓకే గూగుల్ అంటూ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
ఓకే గూగుల్... సింక్రనైజ్ ఫర్ వికసిత్ భారత్ అని సీఎం చంద్రబాబు ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ట్రెండ్ అవుతోంది. గూగుల్ కమ్స్ టు ఏపీ అంటూ ఆ పోస్టులో ఆయన పలువురు ప్రముఖులను ట్యాగ్ చేశారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. చంద్రబాబు పేరే ఒక బ్రాండ్ ఇమేజ్ అని, ఆ ఇమేజ్ ను చూసి ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని నెటిజన్లు అంటున్నారు. గూగుల్ బాటలో పయనించేందుకు మరిన్ని కంపెనీలు రెడీగా ఉన్నాయని చెబుతున్నారు.
ఆనాడు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చామని, అదే మాదిరిగా విశాఖకు గూగుల్ ను తీసుకొస్తున్నామని అన్నారు. సాంకేతికను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుందని, 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని చెప్పారు.