విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో తన డేటా సెంటర్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు ఉండవల్లిలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎఫ్‌డీఐ) ఇదేనని లోకేశ్ గర్వంగా చెప్పారు. ఇది రాష్ట్రానికే కాదని, యావత్ భారతదేశానికే గర్వకారణమని అన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలను మార్చిందని, విశాఖ దశదిశను గూగుల్ మార్చబోతోందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబు దార్శనికత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషి వల్లే ఈ ప్రాజెక్ట్ ఏపీకి వచ్చిందని చెప్పారు. గూగుల్ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాల్లో కీలక సవరణలు చేసిందని, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రాజెక్ట్ కోసం సంపూర్ణ సహకారం అందించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం వల్లే ఇంత వేగంగా పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నామన్నారు.
విశాఖలో గూగుల్ పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఆ సంస్థకు వ్యతిరేకంగా మెయిల్స్ పంపారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదని, పెట్టుబడిదారులు పారిపోయారని విమర్శించారు. 17 నెలల్లోనే తమ ప్రభుత్వం ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిందని అన్నారు. ఇకపైై ప్రతి వారం ఒక కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని లోకేశ్ తీపి కబురు చెప్పారు.