ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా వ్యవహరిస్తున్న ఎన్ సుమంత్ పై ప్రభుత్వం వేటు వేస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఓఎస్డీగా నియమితులైన సుమంత్.. డిప్యుటేషన్ పై మంత్రి కొండా వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నారు. రేవంత్ సర్కారు ఏర్పడిన తర్వాత పర్యావరణ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు.
అనంతరం అటవీ.. పర్యావరణ మంత్రి నుంచి వచ్చిన నోట్ ఆధారంగా 2024 ఫిబ్రవరిలో సుమంత్ ను పీసీబీలో ఓఎస్డీగా నియమించి.. డిప్యుటేషన్ మీద మంత్రి పేషీకి పంపారు. అప్పటి నుంచి ఆయన అక్కడ ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు. సుమంత్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం.. ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్న ఆయన తీరు వివాదాస్పదంగా మారింది.
సుమంత్ తీరుపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా కంప్లైంట్లు చేయటంతో సుమంత్ వ్యవహరంపై సీఎంవో స్పెషల్ ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. మంత్రి ఓఎస్డీడీ మీద వస్తున్న తీవ్ర ఆరోపణలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. సదరు అంశంపై ఫోకస్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
ఈ అంశంపై అంతర్గత విచారణ చేపట్టిన పీసీబీ.. తాజాగా ఆయన్ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొండా సురేఖ ఓఎస్డీ ఇష్యూ నేపథ్యంలో ఇతర మంత్రుల పేషీలు.. సెక్రటేరియట్ లోనూ సుమంత్ తరహాలో ఎందరు ఉన్నారు? అన్న అంశంపై తనకు ప్రత్యేక నోట్ ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.