సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ల విషయంలో తన తల్లి విజయమ్మతో పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు విభేదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం చెన్నైలోని జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) కు చేరింది. ఆ విషయంపై విచారణ నేపథ్యంలో జగన్ కు భారీ షాక్ తగిలింది. వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ పేర్లతో ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల వివాదంపై ఎన్‌సీఎల్‌ఏటీ చెన్నై బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ విజయమ్మకు చెందిన 99.75 శాతం వాటాను యథాతధంగా కొనసాగించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.
అదే సమయంలో వాటాల బదలాయింపు వంటి చర్యలకు పాల్పడకూడదని ఇరు పక్షాలను ఆదేశించింది. రిజిస్టర్‌లో సభ్యుల షేర్లను సవరించాలంటూ ఎన్సీఎల్‌టీ ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై కోర్టు ధిక్కరణ చర్యలేవీ చేపట్టబోమని జగన్, భారతిల తరపు న్యాయవాది ఇచ్చిన హామీని రికార్డు చేసింది. అంతకుముందు హైదరాబాద్ ఎన్సీఎల్‌టీ బెంచ్ జగన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. కంపెనీ షేర్ల బదిలీ చట్టవిరుద్ధమని..జగన్, భారతి, విజయమ్మ షేర్ హోల్డర్ హక్కులను పునరుద్ధరించాలని ఆ బెంచ్ ఆదేశించింది.