తాడిత-పీడిత వర్గాల అభ్యున్నతి కోసం.. అవతరించామని చెప్పుకొన్న సాయుధ నక్సల్స్ పోరులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నక్సల్స్‌కు రైట్ హ్యాండ్‌గా భావిస్తున్న మల్లోజుల వేణుగోపాలరావు, ఉరఫ్ సోను.. తాజాగా ఆయుధాలను పరిత్యజించారు. మహారాష్ట్ర పోలీసులకు లొంగిపోయారు. ఈ విషయాన్ని స్వయంగాఛత్తీస్‌గడ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మే చెప్పడం గమనార్హం.
ఫలితంగా దేశంలో ఇప్పటి వరకు సాగిన సాయుధ నక్సల్స్ పోరుకు దాదాపు తెరపడిందనే చెప్పాలి. ఆయన ఒక్కరే కాకుండా.. మరో 60 మందితో కలిసి.. పోలీసులకు సరెండర్ కావడం గమనార్హం. ఇది ఇప్పటి వరకు జరిగిన లొంగుబాట్లలో అతి పెద్ద ఘట్టం కావడం మరో విశేషం. ఇక, మల్లోజుల విషయానికి వస్తే... అనేక యుద్ధాల్లో ఆరితేరిన ఘటం. అంతేకాదు.. గెరిల్లా యుద్ధాలకు ఆయన శిక్షణ ఇచ్చేవారు.
మావోయిస్టుల కేంద్ర కమిటీలో, మేధావి వర్గంలోనూ.. మల్లోజుల కీలక పాత్ర పోషించారు. అంతేకాదు.. ఏపీ సీఎం చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి సూత్రధారుల్లో మల్లోజుల ఒకరని పోలీసులు చెబుతారు. అయితే.. గత కొన్నాళ్లుగా కేంద్రం జరుపుతున్న ఆపరేషన్ కగార్‌తో అట్టుడుకుతున్న మావోయిస్టు `తీవ్ర వాదం`లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ.. మల్లోజుల మాత్రం లొంగిపోయేందుకు రెడీ అయ్యారన్న వార్తలు తరచుగా వస్తున్నాయి.
అంతేకాదు.. ఆయనను పోలీసులు రెండు మాసాల కిందటే బంధించారన్న వార్తలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మావోయిస్టు ఉద్యమాన్ని ఆయన తప్పుబడుతూ.. రాసిన రెండు లేఖలు సంచలనం సృష్టించా యి. ఆయుధంతో సాధించేది ఏమీ లేదని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే మాట చెప్పుకొచ్చా రు. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని గతంలో తాను ఇచ్చిన ప్రకటన మేరకు.. ఇప్పుడు సరెండర్ అయినట్టు చెబుతున్నారు. ఏదేమైనా.. నక్సల్స్ కుడి భుజం లొంగిపోయిందనే అంటున్నారు.