బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తానంటూ.. రాజకీయ రంగ ప్రవేశం చేసిన జన్ సురాజ్ పార్టీ అధి నేత, రాజకీయ వ్యూహ కర్త అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తాను తప్పుకొం టున్నట్టు ప్రకటించారు. తొలినాళ్లలో పోటీలో ఉన్నానని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఉరఫ్ పీకే.. రాజకీయంగా చర్చకు దారితీశారు. అయితే.. తాజాగా పార్టీ నిర్ణయం మేరకు తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.
దీంతో పీకే నిర్ణయంపై సర్వత్రా చర్చ సాగుతోంది. గత ఏడాదికి ముందే.. పార్టీ పెట్టిన పీకే.. తొలినాళ్లలో పట్టు సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. పాదయాత్ర కూడా చేశారు. అంతేకాదు.. బీహారీల ఆత్మ నిర్భరత, ఆత్మ గౌరవ్ పేరుతో సెంటిమెంటును కూడా రాజేసే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామీణ స్థాయిలోనూ పార్టీని పుంజుకునేలా చేయగలిగారు. ఇక, తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఆయన రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయంపై కూడా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కానీ, ఇప్పుడు అసలు పోటీ నుం చి తప్పుకొంటున్నానని.. పార్టీ నిర్ణయమని పేర్కొనడం గమనార్హం. ఇదిలావుంటే.. పీకే నిర్ణయం వెనుక ఏం జరిగిందన్న చర్చ నడుస్తోంది. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ.. ప్రస్తుతం ఉన్న ఫైట్లో విజయం దక్కించుకోవాలంటే.. తాను పూర్తిస్థాయిలో పార్టీపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పీకే భావిస్తున్నారు. అందుకే.. స్వయంగా పోటీ నుంచి తప్పుకొంటున్నారని సమాచారం.
మరోవైపు.. అంతర్గత సర్వేల్లో పీకే కు సరైన మద్దతు లేదన్న విషయం స్పష్టమైందని అంటున్నారు. రెండు నియోజకవర్గాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. చివరి నిముషంలో మారే అవకాశం ఉందని అంచనా ఉంది. ఈ వాదన కూడా కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోటీ చేసి ఓడిపోతే.. అది తన ఫ్యూచర్‌పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అందుకే.. ఆయన ఎక్కడా పోటీ చేయకుండా కేవలం .. తన వారిని గెలిపించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ సాగుతోంది.